ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెరయిటీ ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నగరి ఎమ్మెల్యే రోజాను ఉద్ధేశించి ‘ఆంటీ’ అంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా? ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం బోండా చేసిన ‘ఆంటీ’ వ్యాఖ్యలు టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. తాజాగా చేసిన ఓ ట్వీట్ లోనూ బోండా ఉమా రోజాను మరోసారి ఆంటీ అని సంభోదించడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ న్యూస్ ఛానల్ వార్తా కథనాన్ని బోండా ఉమా తన ట్వీటుకు ఈ సందర్భంగా జత చేశారు. రోజాను ఆంటీగా బోండా ఉమ సంభోదిస్తున్న తీరుపై వివాదం 2017 నుంచీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బోండా ఉమామహేశ్వరరావు వయస్సు 54 ఏళ్లు కాగా, రోజా వయస్సు 47 సంవత్సరాలు కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్ధేశించి ‘యూ టర్న్ అంకుల్’గా రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తాజాగా సంభోదించడం విశేషం. విశాఖ పర్యటనకు సంబంధించి చంద్రబాబునాయుడు తాజాగా అనుమతికోరిన అంశాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ఆయనను ‘యూ టర్న్ అంకుల్’గా ఉటంకించారు. కాగా చంద్రబాబు వయస్సు ప్రస్తుతం 70 ఏళ్లు కాగా, విజయసాయిరెడ్డి వయస్సు 62 సంవత్సరాలు. అటు బోండా ఉమా, ఇటు విజయసాయిరెడ్డిలు ఇందుకు సంబంధించి వేర్వేరుగా చేసిన ట్వీట్లను దిగువన చూడవచ్చు.