దేనికైనా కాలం కలిసి రావాలంటారు. అది ఏ రంగమైనా కావచ్చు. చివరికి రాజకీయ రంగం కూడా కావచ్చు. కాలం కలిసి రాకపోతే ఏ పనీ ముందు సాగదని కూడా కొందరు విశ్వసిస్తుంటారు. కల్వకుంట్ల కవిత… తెలంగాణా సీఎం కేసీఆర్ కూతురు… నిజామాబాద్ మాజీ ఎంపీ కూడా. సరిగ్గా ఏడాది క్రితం టీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునే కాదు, ఆ పార్టీ లీడర్లను, కేడర్ ను కూడా షాక్ కు గురిచేస్తూ నిజామాబాద్ ఎంపీ స్థానపు ఎన్నిక ఫలితం వెలువడింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం సాధించగా, కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఓటమి బాట పట్టాల్సి వచ్చింది.
ఈ పరిణామాల్లోనే కవిత రాజకీయ భవితపై అనేక ఊహాగానాలు సాగాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా నిజామాబాద్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. తమ నాయకురాలు మళ్లీ రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించనున్నారని సంబరపడ్డారు. ఎన్నికల పోరులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత గత మార్చి 18న నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్ధతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ లీడర్లు తమ పాత్రను నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గత నెల 7వ తేదీన ఈ ఎన్నికకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఇదే దశలో కరోనా వ్యాప్తి తీవ్రం కావడంతో ఎన్నిక వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓలేఖ రాశారు. ఈ పరిస్థితుల్లోనే ఎన్నికను అప్పట్లో వాయిదా వేశారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఇక ఎన్నిక జరగవచ్చనే రాజకీయ వర్గాలు తాజాగా అంచనా వేశాయి.
కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను మరోసారి వాయిదా వేయడం గమనార్హం. నలభై అయిదు రోజులపాటు ఎన్నికను వాయిదా వేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు మరో విఘాతం కలిగినట్లయింది. తమ నాయకురాలు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమేనని, రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కూడా సంపాదించడం ఖాయమనే అంచనాల్లో పార్టీ కేడర్ మాంచి జోష్ లో ఉంది. కానీ మరోసారి ఎన్నిక వాయిదా పడడంతో 45 రోజులపాటు కవిత రాజకీయ భవితకు కలిసిరాని కాలంగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నలభై అయిదు రోజుల తర్వాత…? అని ప్రశ్నిస్తే మాత్రం ఇప్పటికిప్పుడు సమాధానం కూడా లేదు. అప్పటికి కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో? పరిణామాలు ఎలా మారుతాయో? కరోనా తీవ్రత తగ్గుతుందో? పెరుగుతుందో? ఎన్నిక జరుగుతుందో? మళ్లీ వాయిదా పడుతుందో? ఎవరు మాత్రం చెప్పగలరనే సందేహాలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.