కొండలను బండలుగా కూల్చిన
సమ్మెట దెబ్బలకు అల్లాడిన
రాళ్లను కంకరగా చెక్కుతున్న
సుత్తిని చూసి హడిలిపోయిన
కూలీ అడుగుల చప్పుడయితే
పాములా జారి పోదామనుకున్న
బరువు సహకరించక కూలబడ్డ
రాతి మనుసు అంటూ
తిట్టినోళ్ళ నోరుమూయించ
రోడ్ నిర్మాణంలో అగ్రజున్ని చేసి
దేశ ప్రగతికి మైలురాయిని చేశావు
నీ పనితనం కళను చూసి
గాయాలను మరచిపోయా
పిల్లాజెల్లా మండుటెండలో
కరిగిన కండల తారు మంటల్లో
పెద్దసార్ల కారు పయ్యలు అలసిపోవద్దని
సిమెంటులో చెమట చుక్కలు కలిపి
రోడ్లేసిన వలస కూలీ బతుకంతా
కటిక నేలపై తెల్లారిన తీరు మాకుగుర్తే
రాముడి పాదస్పర్శతో
మాలో ఒక రాయి మనిషిగా మారిందట
కంకర రాళ్లకు ప్రాణంపోసి
గ్రామాలు పట్నాలు
అడువులు నదులు
నలుదిక్కుల హైవేలు నిర్మించి
దేశ ఆర్థిక పరుగుల దారి వేశావు
రహదారులనిండా వలస కూలీల
రక్తపు మరకల పాదముద్రలే
కారుతున్న రక్తాన్ని కన్నీటితో
కడుగుతూ
ఇంటికి చేరాలనే చివరి కోర్కెతో
మానవతావాదుల అండతో
పాలకుల కరుకు హృదయాలు
చీల్చుకుంటూ సాగిపోయే
కన్న ఊరి యాత్రదే అంతిమ విజయం
రోకళ్ళు పగిలే ఎండలకు
మoడిపోతున్న నాపైనుంచి
నడవలేక ఆగలేక పరుగెత్తే చిన్నారులు
కాళ్లు పగిలి బొబ్బలెక్కి
కారుతున్న రక్తపుధారలు
నా ఒంటిపై చారలయ్యే
చంటి బిడ్డలు సద్దిమూటలు
పాత బట్టలు వంటపాత్రలు
ముల్లెల నెత్తికెత్తుకుని
కుక్కపిల్లను మూటపై పెట్టిన
నీ ప్రేమకు
విశ్వాసానికి పెట్టిన పేరే చిన్నబోయింది
చేసిన గాయాలు
పోయిన ప్రాణాలు
మిగిల్చిన దుఃఖాన్ని
యాదిచేసుకోవాలి
ఇంకిన కన్నీటిని
కారిన రక్తానికి
ప్రతీకారం తీర్చుకోవాలే
గుర్తుoచుకో…
నా రాతి మనుసు ఎప్పుడూ నీ వెంటే
✍️ మాదాసి రామమూర్తి