పాడుబడ్డ బావిలో తొమ్మది శవాలు… నిన్న నాలుగు, ఈరోజు మరో ఐదు మృతదేహాల వెలికితీత. ఇందులో ఒకే కుటుంబానికి చెందినవారు ఏడుగురు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కలిగించిన విషాద ఘటన. ఏం జరిగింది? ఎలా జరిగింది? హత్యలా? ఆత్మహత్యలా? ఆర్థిక బాధలా? ఆకలి చావులా? అనేక సందేహాలు. ఇప్పటికిప్పుడు జవాబు లేని ప్రశ్నలు. దర్యాప్తు పరంగా పోలీసులకు సవాల్ గా మారిన ఈ ఘటన గురించి వరంగల్ మహానగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి. రవీందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అనుమానాస్పదంగా మరణించిన తొమ్మిది మంది మృతులకు సంబంధించిన కేసు ఛేదించడం కోసం ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన శుక్రవారం ప్రకటించారు. వరంగల్ నగర శివారులోని గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలో వున్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానస్పదంగా తొమ్మిది మృతదేహాలు బయటపడిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వరంగల్ పోలీస్ కమిషనర్ కథనం ప్రకారం…
మక్సూద్ ఆలం తన భార్య పిల్లలతో కలిసి కరీమాబాద్ ప్రాంతంలో నివాసముంటూ గొర్రెకుంటలోని గన్నీ సంచుల గోదాంలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో గన్నీ గోదాం నుంచి ఇంటికి రాకపోక ఇబ్బంది కావడంతో గోదాంలోనే కొంత కాలం నివాసం ఉంటామని గన్నీ సంచుల గోదాం యజమానికి తెలిపాడు. ఇందులో భాగంగానే గత 45 రోజులగా గోదాంలోని భవనంలో మక్సూద్ ఆలం నివాసముంటున్నారు. ఇదే భవనంలో బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రీరాం, శ్యాంలు కుడా అక్కడే పనిచేసుకుంటూ ఉంటున్నారు.
గురువారం రోజు గోదాంలో ఎవరు లేరని దాని యజమాని జూలూరి భాస్కర్ కు ఆటో డ్రైవర్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఉదయం 7.30 గోదాంకు చేరుకున్న యజమాని భాస్కర్ గోదాంలో నివాసముంటున్న మక్సూద్, అతని భార్య నిషా, కూతురు బుధ్రా, మనుమడు, చిన్నకోడుకు సొహైయిల్, పెద్దకుమారుడు, బీహర్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు మొత్తం ఎనిమిది మంది కనిపించకుండా పోవడంతో గోదాం యజమాని తన వ్యాపార భాగస్వామి సూర్యదేవర సంతోష్ సహా మిగతా వర్కర్లతో కలిసి వెతకడం ప్రారంభించారు.
గురువారం మద్యాహ్నం 2 గంటల సమయంలో గోదాం పక్కనే గల పాడుబడిన బావిలో కనిపించకుండా పోయిన మక్సూద్ అలంతో పాటు కుటుంబ సభ్యులైన భార్య నిషా, కూతూరు బుధ్రా, మనుమడు శవాలుగా కనిపించడంతో గోదాం యజమాని గీసుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు భాగంగా శుక్రవారం శవాలను గుర్తించిన పాడుపడిన బావిలో నీటిని తొలగిస్తున్న క్రమంలో మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. వీరిలో మరణించిన మక్సూద్ ఆలం ఇద్దరు కుమారులు షాబాద్ ఆలం, సొహైయిల్ ఆలం, శ్రీరాం, శ్యాం, షకీలుగా గుర్తించారు. ఈ సంఘటలో మొత్తం 9మంది వ్యక్తులు మరణించారని, అది ఎలా జరిగి ఉంటుందనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
మొత్తం 9 మంది మృతదేహాలకు సంబంధించిన కేసును ఛేదించేందుకు అన్నికోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ శాఖ పరంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని కూడా వినియోగించనున్నట్లు పోలీస్ కమిషనర్ వివరించారు.