ఫొటోను జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రానికి సమీపంలోని రోడ్డు ఇది. అశ్వారావుపేట-భద్రాచలం ప్రధాన మార్గం కూడా. రాష్ట్ర విభజనకు పూర్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనిదే ఈ కుక్కునూరు మండల కేంద్రం. రోడ్డుకు ఇరువైపులా పార్కు చేసి ఉన్న బైకులు కనిపిస్తున్నాయి కదా? అన్నీ ఖరీదైన బైకులే. కనిష్టంగా రూ. 60 వేల నుంచి గరిష్టంగా రూ. లక్ష ఖరీదైన ద్విచక్ర వాహనాలే. రోడ్డుకు ఇరువైపులా ఈ బైకులు ఎందుకు పార్కు చేసి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ బైకుల యజమానులు ఉపాధి హామీ కూలీలు. ఔను… అక్షరాలా ఈ బైకుల ఓనర్లు కూలీలే. అందులో ఏ సందేహమూ లేదు.
అదేమిటి… కూలీలు బైకులపై పనికి వస్తారా? అని నివ్వెరపోవలసిన అవసరం లేదు. బైకులే కాదు ఒకప్పుడు కార్లతో తిరిగిన దర్జా బతుకుల తాజా సిత్రమిది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత పరిహారం అందకముందు కూడా వీళ్లంతా వ్యవసాయ, కూలీ పనులతో జీవించినవారే. పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో భూములు కోల్పోవడం, నిర్వాసితులుగా మారిన బాధితులకు రూ. లక్షల్లో ప్రభుత్వం పరిహారం చెల్లించిన సంగతి తెలిసిందే. భూసేకరణ చట్టం ప్రకారం దశలవారీగా వివిధ ప్యాకేజీల్లో అందిన భారీ డబ్బుతో వ్యవసాయ కూలీలేకాదు, భూములు కోల్పోయిన అనేక మంది గిరిజనులు కూడా రికార్డుల్లో మాత్రమే లక్షాధికారులయ్యారు.
పోలవరం ప్యాకేజీ డబ్బు ప్రభావంతో జంగారెడ్డిగూడెం వంటి చిన్న పట్టణంలోనూ విదేశీ కార్ల షోరూంలు వెలిశాయంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారిగా పరిహారం రూపంలో లక్షలాది రూపాయలు వచ్చాయ్. అనేక మంది ఖరీదైన కార్లను కూడా కొనుగోలు చేశారు. చిట్ ఫండ్ కంపెనీలు కొన్ని పోలవరం ప్యాకేజీ అందుకున్న లబ్ధిదారులను టార్గెట్ చేసి భారీ ఎత్తున తమ వ్యాపారాన్ని నిర్వహించుకున్నాయి. ఇత్తడో, పుత్తడో తెలియని గిరిజనుల అమయకత్వాన్ని కొందరు పసిడి వ్యాపారులూ సొమ్ము చేసుకున్నారనే వాదనలూ ఉన్నాయి. మరి కొందరు భూములు కొనుక్కున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.
నాణేనికి మరోవైపు పరిశీలిస్తే పోలవరం పరిహారపు ప్యాకేజీల అంశంలో వాస్తవికంగా బాగుపడిందెవరో తెలుసా? మధ్య దళారులు మాత్రమేనట. గిరిజనుల అమాయకత్వమే పెట్టుబడిగా ప్రస్తుతం దళారులు మాత్రమే సంతోషంగా ఉన్నారు. కొన్ని ఘటనల్లో లేని భూములను సృష్టించి, రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. గిరిజనులకు అందాల్సిన పరిహారాన్ని పైరవీకార్లు నిలువునా దోచుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
కానీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు-కమ్-పరిహారపు లబ్ధిదారులైన గిరిజనుల్లో అనేక మంది బతుకులు మళ్లీ రోడ్డున పడ్డాయి. ఖరీదైన కార్లు పోయాయి. దళారులు దోచుకోగా, మిగిలిన డబ్బూ ఖర్చయిపోయింది. బైకులు మాత్రమే మిగిలాయ్. అదే బైకులపై ఉపాధి హామీ కూలీ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ఫొటోలో మీకు కనిపిస్తున్న బైకులు పోలవరం పరిహారపు ప్యాకేజీల్లో రికార్డుల పరంగా లక్షాధికారులైన కొందరు లబ్ధిదారులకు చెందినవే!