ఈ అర్థరాత్రి నుంచే తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయా? కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు తహశీల్దార్లకు పంపిన ఓ సమాచారం ఇదే అంశాన్ని వెల్లడిస్తోంది. వాస్తవానికి కరోనా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సులను నడిపించే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమేరకు ప్రజారవాణా అంశంలో తలెత్తుతున్న ఇబ్బందులపై లోతైన అధ్యయనం చేసిన అనంతరమే బస్సులు నడపాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో బస్సులు నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాభై శాతం మాత్రమే సీటింగ్, భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరు, ఇద్దరు కూర్చునే సీట్లో ఒకరికి మాత్రమే బస్సుల్లో ప్రయాణీకులకు అనుమతించనున్నట్లు సమాచారం. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులను మాత్రమే తొలుత రోడ్లపైకి అనుమతిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలోని తహశీల్దార్లకు వాట్సాప్ మెసేజ్ ఒకటి ఉన్నతాధికారుల నుంచి అందడం గమనార్హం. కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మావతి పంపిన మెసేజ్ ప్రకారం సోమవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నడిచే అవకాశం కనిపిస్తోంది. అదీ ఈ మెసేజ్. దిగువన చదవండి.
కరీంనగర్ జిల్లాలోని, అందరు తహశీల్దార్లకు తెలియజేయునది ఏమనగా.
18.5.2020 అర్ధరాత్రి నుండి ఆర్టీసీ రవాణా పునరుద్ధరించపడుతున్న నేపథ్యంలో
ప్రస్తుతం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో నడపబడుతున్న మున్సిపల్ మార్కెట్ అంబేద్కర్ స్టేడియం లోపలికి మార్చబడుతుంది. ఇట్టి విషయాన్ని మీ గ్రామాలలో కూరగాయలు పండించే రైతులకు మరియు అమ్మకం దారులకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి. రేపు ఉదయం కూరగాయల రైతులు మరియు అమ్మకం దారులు నేరుగా అంబేద్కర్ స్టేడియంనకు వెళ్ళవలసి ఉంటుంది. ధన్యవాదములు.