తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఓ న్యూస్ ఛానల్ విలేకరులు అర్జంటుగా తుపాకీ కొనుక్కోవలసిన అవసరం ఏర్పడినట్లుంది. ఆత్మరక్షణ కోసం కాదు సుమీ. 1989లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రసాదించిన ‘ఫ్రీడమ్’ కారణంగా పీపుల్స్ వార్ నక్సల్స్ పార్టీలో చేరిన ‘లంపెనిస్టు’ల తరహాలో నగదు వసూళ్ల కోసం అన్నమాట. సమాజం మీదపడి దోపిడీ చేసేందుకన్న మాట. ఎందుకంటే ఆయా న్యూస్ ఛానల్ కొత్త బాస్ ప్రతి జిల్లా రిపోర్టర్ కు విధించిన వసూళ్ల (యాడ్స్ అంటున్నారు) టార్గెట్ అక్షరాలా రూ. రెండు లక్షలు మరి. పైసా వసూల్ చేతగాని రిపోర్టర్లు ఇంటిబాట పట్టవచ్చని కూడా కొత్త బాస్ సెలవిస్తున్నారు. వివరాల్లోకి వెడదాం.
ఆ మధ్య ఓ తెలుగు న్యూస్ ఛానల్ బాస్ గా వ్యవహరించిన వ్యక్తి ఒకరి వైఖరి కారణంగా సదరు సంస్థ దిక్కూ, దివాణం లేకుండా మూతపడిన సంగతి తెలిసిందే కదా? ఈ విచిత్ర వైఖరి గల బాస్ కారణంగా అప్పట్లో ఆ ఛానల్లో పనిచేస్తున్న పలువురు విలేకరులు ఆత్మహత్యాయత్నాలకు కూడా పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. వివాదంలోకి కొన్ని జర్నలిస్టుల సంఘాలు ఎంటరై, సదరు బాస్ వసూళ్ల వేధింపుల సమస్యకు మధ్యవర్తిత్వం వహించాయి కూడా. సరే… ఆ బాస్ ధోరణితో తర్వాతి పరిణామాల్లో సదరు ఛానలే మూతపడిందన్నది వేరే విషయం.
ఇక వర్తమానంలోకి వస్తే… ఆ ఛానల్ బాసే ప్రస్తుతం ‘ఎయిర్’లో ఉండీ, లేనట్లు మిణుకు మిణుకుమంటున్న మరో ఛానల్ కు ముఖ్య హోదాలో ఎంటరయ్యారు. వచ్చీ రాగానే జిల్లా విలేకరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ‘సంస్థకు చెందిన ఛానళ్ల (రక రకాలుగా ఉన్నాయి లెండి) పరిస్థితి ఆర్థికంగా బాగోలేదు. ప్రతి జిల్లాకు రూ. 2 లక్షలు టార్గెట్ విధిస్తున్నాను. జూన్ 15వ తేదీ లోపు ఆయా మొత్తం డబ్బును వసూల్ చేసి పంపాలి. యాడ్ రెవెన్యూ కింద మీ వసూళ్ల మొత్తాన్ని పరిగణిస్తాం’ అని హుకుం జారీ చేశారు.
ఇంకేముంది…? సంస్థలో పనిచేసే విలేకరులు లబోదిబోమంటున్నారు. అసలు ఛానల్ కనెక్టివిటీ పరిస్థితే ఆశాజనకంగా లేదు. జనం నోళ్లలో నానుతున్న ప్రముఖ ఛానల్ కూడా కాదు. అందులోనూ లాక్ డౌన్ పరిణామాలు. ఇదెక్కడి ‘గోస’ బాబోయ్… అంటూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఓ విలేకరి వీడియో కాన్ఫరెన్స్ లో కొత్త బాస్ దృష్టికి తీసుకువెళ్లారట. ‘లాక్ డౌన్ లో మనకు యాడ్స్ రూపేణా డబ్బు ఎవరిస్తారు? మన ఛానల్ పరిస్థితి దారుణం కదా?’ అన్నందుకు కొత్త బాస్ కస్సున లేచి బుస్సుమన్నారట. ‘చేతగాకపోతే ఇంటికి వెళ్లవచ్చు. మేం మరో విలేకరిని నియమించుకుంటాం’ అని ఓపెన్ గానే ఆగ్రహించారట.
ఇటువంటి బాస్ ఆదేశాన్ని ‘ఫుల్ ఫిల్’ చేయాలంటే నెలకు రూ. 2 లక్షల పైసా వసూల్ తంతును జిల్లా విలేకరి బాధ్యతగా భుజాన వేసుకోవాలి. లేదంటే ఫస్ట్ ఊడేది ఎన్నాళ్లుగానో జీతం లేని అతని కొలువే మరి. అసెంబ్లీ నియోజకవర్గ కంట్రిబ్యూటర్లకు వసూళ్ల భారాన్ని పంపిణీ చేయాలి. ఉదాహరణకు ఓ ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ప్రతి కంట్రిబ్యూటర్ కు రూ. 20 వేల చొప్పన టార్గెట్ విధించాలి. ఓ సాధారణ కంట్రిబ్యూటర్ నియోజకవర్గ స్థాయిలో రూ. 20 వేల యాడ్ రెవెన్యూ తీసుకురావడం సాధ్యమేనా? ఇదీ అసలు ప్రశ్న. ఓవైపు కరోనా కల్లోలం… మరోవైపు లాక్ డౌన్ పరిస్థితులు. అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలైన దుస్థితి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ఆయా న్యూస్ ఛానల్ విలేకర్లు ఏం చేయాలి? ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే ఏదో తంటాలు పడాల్సిందే.
అందుకే… ‘తుపాకీ పట్టుకో విలేకరన్నో…’ అని శీర్షీకరించింది. జర్నలిస్టుగా కాకుండా ‘లంపెనిస్టు’గా మారాల్సిన దుస్థితి మీడియాలోని మిడిల్ మేనేజ్మెంట్ వ్యక్తుల వల్ల దాపురించిందని ఘోషిస్తున్నది. ‘మేం రెవెన్యూ తీసుకువస్తాం. మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి’ అంటూ మీడియా యాజమాన్యాలకు ఆశ చూపుతున్న ఇటువంటి ‘మిడిల్ మేనేజ్మెంట్ బాస్’ల అంశంలో వ్యవహరించవలసిన తీరును తేల్చుకోవలసింది సాధారణ విలేకరులే. అలాగని తుపాకీ పట్టుకోవద్దు సుమీ… చట్టం చట్రంలో బుక్కవుతారు. మీ కుటుంబాలు రోడ్డున పడతాయ్. జాగ్రత్త విలేకరన్నో…!