ఈ మధ్యకాలంలో మీరెప్పుడైనా మహారాష్ట్ర హైవేలోని మారుమూల ప్రాంతంలో గల డేరా కర్ సేవా గురుద్వారాకు వెళ్లారా? అక్కడ గురుద్వారా లంగర్ సాహెబ్ అధిపతి బాబా కర్నైల్ సింగ్ ఖైరా అని ఓ పెద్దాయన ఉంటారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. ఆయనకు గల ఆస్తి, పాస్తులు మూడు జతల దుస్తులు మాత్రమే. కానీ పదిహేను లక్షల మంది వలస కూలీలకు ఆయన ఆహారాన్ని ఉచితంగా అందించారంటే ఆశ్యర్యపడాల్సిందే.
కరోనా కల్లోల పరిణామాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెడుతున్న సందర్భంగా కర్నైల్ సింగ్ ఖైరా చేసిన ఆహారపు సేవ ఇది. రెండు కిలోల బియ్యం, నాలుగు ఉల్లిగడ్డలు, కాస్త చింతపండు పంపిణీ చేసి ‘దానకర్ణు‘ల్లా ఫోజు కొట్టేవారికి ఈ సింగ్ సాబ్ చేసిన సేవ చెంపపెట్టులాంటిదని చెప్పక తప్పదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దిగువన చూసేయండి.