వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి ఉదంతంలో మొత్తం 100 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తుండగా, ఇప్పటి వరకు 55 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫార్మా విలేజ్ భూ సేకరణకై రైతులతో చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పైనా, ఇతర అధికారులపైనా దాడి జరిగిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. వదంతులు వ్యాపించకుండా దుద్యాల, కొడంగల్, బోంరాస్ పేట మండలాల్లో ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ముఖ్యంగా సంఘటన జరిగిన లగచర్ల గ్రామంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
ఇదిలా ఉండగా నిన్నటి కలెక్టర్ పై దాడి ఘటన ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. మొత్తం సంఘటనకు సూత్రధారిగా పోలీసు అధికారులు వెల్లడించిన భోగముని సురేష్ కోసం గాలిస్తున్నారు. మణికొండలో నివాసముండే సురేష్ నిన్న ఘటనా స్థలికి వచ్చి స్థానికులను ప్లాన్ ప్రకారమే రెచ్చగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగానూ సురేష్ ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.