అర్ధ శతాబ్ధానికి పైగా అజ్ఞాతంలో గల నక్సలైట్ నాయకుడిని ఆంధప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన 74 ఏళ్ల వయస్సుల గల పాతూరి ఆదినారాయణస్వామి అలియాస్ చంద్రనను గుంటూరు నగరంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. చంద్రన్న ప్రస్తుతం న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
చంద్రన్న 1967 నుంచి ఇప్పటి వరకు కూడా రహస్య జీవితాన్నే గడుపుతుండడం గమనార్హం. తొలితరం విప్లవకారుల్లో నేటికీ అజ్ఞాతంలో గల నక్సల్ నేతగా ఆయనకు విప్లవోద్యమంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలోని ఉమ్మడి ఎంఎల్ పార్టీ నాయకత్వంలో గోదావరి లోయ పరీవాహక ప్రాంతంలో ఆ పార్టీ విస్తరణకు చంద్రన్న కృషి చేశారు.
అయితే 1984లో ఉమ్మడి ఎమ్ ఎల్ పార్టీలో సంభవించిన చీలికలో పైలా వాసుదేవరావు, రాయల బోసు, చంద్రన్నలు ప్రజాపంథా వర్గంగా విడిపోయారు. ప్రజాపంథా న్యూడెమోక్రసీగా ఆవిర్భవించినప్పటికీ, 2013 సంవత్సరంలో సంభవించిన చీలిక వర్గానికి చంద్రన్న నాయకత్వం వహించారు. దీన్ని చంద్రన్న వర్గంగా, రాయల బోసు నాయకత్వంలో గల పార్టీని రాయల వర్గంగా న్యూ డెమోక్రసీ తమ కార్యకలాపాలు నిర్వహించాయి.
ఉమ్మడి న్యూ డెమోక్రసీకి చంద్రన్న ఒక దఫా కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయస్సు కలిగిన చంద్రన్న53 ఏళ్ల పాటు రహస్య జీవితాన్నే గడిపారు. చంద్రన్న ఆయన సతీమణి, ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి పి. టాన్యా సైతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని పిల్లలు లేని ఆదర్శ దంపతులుగా పార్టీ పరంగా గుర్తింపును కలిగి ఉన్నారు.
ఫొటో: పోలీసుల అదుపులో చంద్రన్న (బ్లూ షర్ట్ ధరించిన వ్యక్తి)