రూపాయి రూపాయి దాచుకుంటే చెదలు తినేసి ఆగమయ్యాయని గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంట్లో మనుషులు.టెక్నాలజీ పుంతలు తొక్కి డిజిటలైజేషన్ ప్రపంచాన్ని చుట్టుముడుతుంటే కనీసం బ్యాంకులో కూడా కాకుండా ట్రంకు పెట్టెలో ఏకంగా రూ. 5 లక్షలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టింది. చివరికి చిన్న పిల్లలు కూడా ఆడుకోడానికి పనికి రాకుండా పోయాయి. అసలు వీరి సొంత డబ్బేనా? లేక ఎక్కడైనా దొరికాయా అని పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు చెప్తున్న వివరాల ప్రకారం… కృష్ణా జిల్లా మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద నివసించే బిజిలి జమలయ్య పందుల వ్యాపారం చేస్తుంటాడు. తన వ్యాపారంలో వచ్చిన లాభాల మొత్తాన్ని దాచుకునేందుకు అతనికి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి నగదును భద్రం చేసుకున్నాడు. ఇలా రూ. పది లక్షల వరకు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. సుమారు రూ. 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి ఒక లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు. లోపలున్న డబ్బును చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచం పై వేసి లెక్కపెట్టడం ప్రారంభించారు. చుట్టుప్రక్కల వారికి తెలియడంతో ఆనోటా ఆనోటా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. పోలీసులను చూడడంతో నే బావురుమంటూ తమ భాధ వెళ్ళగక్కారు జమలయ్య కుటుంబీకులు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. చెదలు పట్టిన నోట్లతో చిన్న పిల్లలు ఆడుకోవడం చూసి స్థానికులు నోరెళ్ళబెట్టారు. పోలీసులు మాత్రం పూర్తి వివరాలు లాగే క్రమంలో దర్యాప్తు చేస్తున్నారు