ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఎల్లమ్మ తల్లి అలిగి చెట్టెక్కిందని చెప్పుకున్నపుడు కూడా హుస్నబాద ఎల్లమ్మ చెరువు కట్ట మీద బతుకమ్మ పండుగ ఆగలే.. హుస్నబాదకు వన్నె తీసుకొచ్చినవాటిలో ముఖ్యమైనవి ఎల్లమ్మ తీర్థం, ఎల్లమ్మ చెరువు కట్ట మీద బతుకమ్మ పండుగ.. నిండుగ నీళ్లున్న చెరువు కట్ట మీద బతుకమ్మలను పెట్టుకుని అమ్మలు, అక్కచెల్లెళ్లు తీరొక్క చీర కట్టుకుని లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, వలయాకారంలో తిరుగుతూ, రాగయుక్తంగా పాటలు పాడుతుంటే అక్కడ చేరినోళ్లంతా మురిసిపోయేది. ఆ ఆనందాన్ని వర్ణించడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి.
ఎల్లమ్మ చెరువు కట్ట రంగు రంగు పూల సింగిడిగా మారిపోయేది. ‘ఉయ్యాలో’ అనే మకుటంతో అమ్మలక్కలు తమ కష్టసుఖాలనే పాటలుగా మలుచుకునేవారు. భావోద్వేగాలు వరదలా ప్రవహించేవి. కట్ట మీదికెళ్లి ఊరు కనుల పండువగా కనిపించేది. బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, కట్టకింద ఫలహారాలు తినేసి, చెరువు నీళ్లను తాంబాళంలో నింపుకుని ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ ఇంటికి బయలుదేరితే ఊరిలో రంగురంగుల దీపాలు స్వాగతం పలికేవి. కరువు కాటకాలకు నిలయమైన హుస్నబాదకు వాన పడితే కూడా అది పండుగగానే ఉండేది. చెరువు ఎండిపోయి, అక్కడక్కడా గోతులలో కొద్దిపాటి నీళ్లున్నా బతుకమ్మ పండుగనాడు ఎల్లమ్మ చెరువు కట్ట బంగారు కాంతులను వెదజల్లేది. తీరొక్క పూలతో చెరువు కట్ట సందడిగానే కనిపించేది. నా ఎరుకలో చెరువు కట్ట మీద బతుకమ్మ పండుగ జరగకుండా ఏనాడూ లేదు…
చెరువు నిండా నీళ్లున్నయి.. నాకు తెలిసి చరిత్రలోనే మొదటిసారిగా 58 రోజులుగా ఎల్లమ్మ చెరువు మత్తడి కొడుతోంది, మత్తడి మీదికెళ్లి అంకూసు గండిలోకి నీళ్లు జలజలా దూసుకుపోతున్నయి. పారుతున్న అలుగును చూసేందుకు జనం తీర్థంలా వస్తూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ బతుకమ్మ పండుగ ఎలా జరుగాలే.. పండుగ శోభ ఉట్టిపడాలె కదా.. కానీ మాయదారి కరోనా ఆ ఆనందాన్ని మింగేసింది. చరిత్రలోనే తొలిసారిగా ఎల్లమ్మ చెరువు కట్ట మీద బతుకమ్మ పండుగ కనిపించలే. ఇది మాటలకందని విషాదమే.. మన జీవితకాలంలోనే ఇది జరగడం మదిని కలిచివేసే అంశమే… ఓ పదిరవై మంది మాత్రం కట్ట మీద బతుకమ్మలు ఆడారు. కాకపోతే బతుకమ్మ పండుగ సందడి మాత్రం ఎక్కడా తగ్గలే. ఎవరి ఇంటి ముందట వారు.. వాడకట్టులోనూ జోరుగా బతుకమ్మ పాటలు మారుమోగినయి. కరోనా గుండెల్లో గుబులు రేపినయి. విరుల సింగారాలు వాకిట నిండా పరుచుకున్నయి. గూడు తెంచుకున్న సీతాకోక చిలుకలు సరదాగా, యథేచ్చగా ఎగిరినయి. సరాగాలు పంచినయి. సంబురాలు చేసినయి. సర్కారు పూల బాణం దారి తప్పిందా?!
✍️ మహ్మద్ ఫజుల్ రహమాన్