దేశంలో కొత్తరకం బ్రిటన్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలోనే బర్డ్ ఫ్లూ సైతం కోరలు చాస్తోంది. ఈ పరిణామం సహజంగానే ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం మరో 20 కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రిటన్ కరోనా కేసుల సంఖ్య 58కి చేరుకుంది. సోమవారం వరకు ఈ కేసుల సంఖ్య 38 కాగా, మంగళవారం మరో 20 నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
కాగా కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలోనే దేశంలో బర్డ్ ఫ్లూ కూడా విస్తరిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బయటపడ్డ బర్డ్ ఫ్లూ కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వెలుగు చూసింది. దీంతో నాలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వ్యాధి పాకినట్లయింది. అటు కేరళలోనూ బాతులు, కోళ్లు బర్డ్ ఫ్లూ వల్ల మరణిస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళలో వెలుగుచూసి ప్రాంతాల్లోని కిలోమీటరు పరిధిలో 40 వేలకు పైగా బాతులు, కోళ్ల వంటి పక్షులను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.