సరిగ్గా 213 ఏళ్ళ క్రితం తన నిస్వార్ధ ప్రేమ కోసం దేశం కానీ దేశంలో విషాదంగా ముగిసిన సంచలన ప్రేమగాథ ఇది. ఎందుకో ఇంతటి గొప్ప ప్రేమగాథ చరిత్రలో సరిగ్గా వెలుగు చూడలేదు. బందరులోనే పుట్టిన ఎందరికో ఇంతటి ప్రేమగాథపై అవగాహన లేదు. చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ అత్యధికులకు తెలియని కన్నీటి గాథ ఇది.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన బందరులో ఉన్న సెయింట్ మేరీస్ చర్చి భారతదేశంలోని పలు పురాతన చర్చలలో ఆసక్తికరమైన నేపథ్యం ఉన్న చర్చి ఇది. క్రీస్తుశకం 1800 ప్రారంభకాలంలో బ్రిటిష్ దళాలు బందరు కోట ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని ఉండేవి. బ్రిటిష్ పాలనకాలం. మచిలీపట్నం రేవు పట్టణం కావడంతో పశ్చిమ దేశాలతో ఎగుమతులు, దిగుమతులు విరివిగా జరిగేవి. అందుకు తగ్గట్టుగా నాటి బందరులో ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ కాలనీలు ఏర్పడ్డాయి. వారి సైనిక స్థావరాలుండేవి. సైనికాధికారులు కుటుంబాలతో నివసించేవారు. నాడు అక్కడ ఉన్న ఒక చిన్న క్రైస్తవ సమూహం కోసం నూతనంగా నిర్మించిన సెయింట్ జాన్ ది డివైన్ చర్చి ఉండేది. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సైనికాధికారులు ఉద్యోగులు అక్కడకు వెళ్ళి ఏసుక్రీస్తుని ఆరాధించేవారు.
అటువంటి వ్యక్తులలో ఒకరైన కెప్టెన్ రాబిన్ సన్ ఒకరు. ఆయనకు అరబెల్లా అనే ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆ కాలంలో బందరు పోర్ట్ కు ఒక మేజర్ జనరల్ జాన్ పీటర్ ని బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. దేశం కానీ దేశంలో ఆనాడు బ్రిటిష్ ఉన్నతాధికారుల కుటుంబాల మధ్య తరచూ ఆత్మీయ కలయికలు ( ఇపుడు జరుగుతున్న గెట్ టు గెదర్ మాదిరిగా ) జరిగేవి. అలాంటి ఓ విందు సమావేశంలో అరబెల్లా- జాన్ పీటర్ ఒకరినొకరు చూసుకున్నారు . తొలిచూపులోనే వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. ప్రేమ పరవశం వారి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరచింది.
ప్రేమబంధంలో మునిగితేలుతున్న అరబెల్లా- పీటర్ లకు మాత్రం చివరకు అంతులేని వేదనే మిగిలింది. వారి ప్రేమ ఓ విషాదగీతంగా మిగిలింది. కరువు, దుర్భిక్షం అంటే ఏంటో తెలియని ప్రశాంతమైన బందరు పట్నంలో అక్కడ నాటి మత పెద్దలకు పెద్ద మనసు కరువైంది. సలీం అనార్కలి ప్రేమ గాథలో మాదిరిగా అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్సన్ అక్బర్ పాత్ర పోషించాడు. సలీం అనార్కలి ప్రేమను చిదిమేయడానికి మొఘల్ బాదుషా అక్బర్ నిరంకుశంగా వ్యవహరించినట్లే అరబెల్లా తండ్రి రాబిన్సన్ సైతం అరబెల్లా- జాన్ పీటర్ ప్రేమని చిదిమేసే విలన్ పాత్ర పోషించాడు. ఆమెను ఇంగ్లాండ్ కు బలవంతాన పంపించాడు. కాల గమనంలో నాలుగేళ్లు గడిచాయి. మానసిక వేదనతో అరబెల్లా కుంగిపోసాగింది. ఆమెకు జాన్ పీటర్ మీద ప్రేమ తగ్గడం లేదు, పీటర్‌కూ అంతే అరబెల్లాపై ప్రేమ తగ్గడం లేదు. ఇటువైపు ఏళ్లు గడుస్తున్నా తండ్రి కెప్టెన్ రాబిన్ సన్ మనసు మెత్తబడడం లేదు. క్రమంగా పీటర్ లో నిరాసక్తత, నిర్లిప్తిత పెరగసాగింది. తానొక సైనికాధికారిని మాత్రమేనని మేజర్ జనరల్ జాన్ పేటర్ తన మనస్సుకి సర్ది చెప్పుకొని బందరు పోర్ట్ సంబంధిత పనుల్లో నిమగ్నమై కేవలం యాంత్రికంగా మారిపోతున్నాడు. అరబెల్లాకు ఎటు పాలుపోని పరిస్థితి…వి వాహ జీవితం గూర్చి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది.
తండ్రి కెప్టెన్ రాబిన్ సన్ తమ పెళ్ళికి ఒప్పుకోకపోయినా సరే.. తండ్రి మనస్సు ఎన్నటికీ కరగదని ఆలోచించి… ఆలోచించి అరబెల్లా ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొంది. ఏది ఏమైనా జాన్ పీటర్ ను పెళ్లి చేసుకోవడానికే సిద్ధమైంది. ఓ రోజు… అరబెల్లా ఇల్లు వదిలి నేరుగా ఇంగ్లాండ్ నుంచి ఓడ ఎక్కి జాన్ పీటర్ వద్దకు దైర్యంగా కట్టుబట్టలతో వచ్చేసింది. ఆనాడు బందరులో వీరి ప్రేమ ఒక సంచలనం. అందరికి వీరి ప్రేమ గూర్చి పెద్ద చర్చ ! ఇటువైపున జాన్ పీటర్ జీవితంలో ఊహించని ఆనంద క్షణాలు స్వంతమయ్యాయనే సంతోషం. పెళ్లి గురించి అందరి ఆడపిల్లల మాదిరిగానే ఎన్నో రంగురంగుల కలలు కన్నది అరబెల్లా. తమ జరగబోయే పెళ్ళి కోసం అరబెల్లా కోరిక మేరకు లండన్ నుంచి వజ్రపు తునకలు పొదిగిన వెడ్డింగ్ గౌన్కూ, డైమండ్ రింగ్కూ టెలిగ్రాఫ్ ద్వారా ఆర్డర్ పంపాడు. వివాహానికి సంబంధించిన పెళ్లి దుస్తులు ఇంగ్లాండ్ నుంచి ఓడలో బందరు రేవుకి వచ్చేశాయి.
మరో వారం రోజుల్లో వారి పెళ్లి. ఎప్పటి మాదిరిగా బ్రిటిష్ అధికారుల ఆత్మీయ కలయికలో ‘తాము ఇక పెళ్లి చేసుకోబోతున్నట్లు’ జాన్ పేటర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. పెద్దల సమక్షంలో న్యాయబద్ధంగా తాము ఇరువురం వివాహం చేసుకొంటున్నట్లు ప్రకటించారు. పెళ్ళి వేడుకలకు అందర్నీఆహ్వానించాలనే ఆదుర్దా అరబెల్లాకి. పట్టరాని సంతోషంతో ఆమెకి అసలు భోజనమే చేయాలనిపించడంలేదు. ఇలా కొద్ది రోజులు గడిచేసరికి ఆమెకి ఎంతో నీరసంగా మారిపోయింది. కానీ అది మలేరియా లక్షణాలు జ్వరం తెచ్చిన నీరసం. అలా మంచం పట్టిన అరబెల్లా అకస్మాత్తుగా 1809, నవంబర్ 6 వ తేదీ తుదిశ్వాస విడిచింది.
తన కోసం అందరినీ వదిలి వచ్చిన అరబెల్లాకు తానేమీ చేయలేకపోయానని జాన్ పీటర్ హృదయ వేదనతో కృంగిపోయాడు… అరబెల్లా పార్ధీవ దేహాన్ని వందల ఏళ్ళు చెక్కుచెదరని విధంగా రసాయనాలతో ఆమె శరీరాన్ని పులిమాడు. ఇంగ్లాండ్ నుంచి ఓడలో వచ్చిన ఆమె కోరుకున్న వెడ్డింగ్గౌన్ ని ఆమె నిర్జీవ దేహానికి తొడిగి. అచ్చం పెళ్లి కూతురి మాదిరిగా అలంకరించాడు. తాను సూటు ధరించి ఆమె నిర్జీవ దేహం చేతి వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఆమె చల్లని నుదిటిపై ప్రేమగా ముద్దాడిన జాన్ పీటర్ కనుల నుండి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తుంటే అరబెల్లాను పూలచెండును పట్టుకున్నంత జాగ్రత్తగా పైకి లేపి గాజు పెట్టెలో భద్రపరిచాడు.
పూటలు గడుస్తున్నాయి ఇక ఆమెను ఖననం చేయాలి. అయితే… వారి ప్రేమను నాటి కాథలిక్ మత పండిత వర్గం ఏమాత్రం అంగీకరించలేదు. పట్టణంలో ఉన్న ఏ శ్మశానవాటికలోకీ ఆరబెల్లా మృతదేహానికి ఖననం చేయడానికి అనుమతివ్వలేదు. కళ్ల ముందు అరబెల్లా ముఖం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు ఉంది. ‘నిన్నొదిలి… నేనెక్కడికీ వెళ్లలేను పీటర్ మై లవ్’ అన్నట్లు ఉంది ఆమె ప్రశాంతమైన బంగారు ముఖం !! అవును… తన కళ్ల ముందు నుంచి అరబెల్లాను ఎవరూ తీసుకెళ్లలేరనే జాన్ పీటర్ కు ఎక్కడలేని మొండితనం ఆవరించింది. పీటర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. బందరు లో ఓ మారుమూల ఉన్న ప్రస్తుతం ఆనందపేటగా పిలుస్తున్న డచ్ వారి ఆధీనంలో ఉన్న ఖాళీస్థలం ఉంది. ఆంగ్లేయులకు నాడు బద్ధ శత్రువులైన డచ్ వారి మనస్సు వీరి విషాద ప్రేమకు చలించింది. తమ ఆధీనంలో ఉన్న పన్నెండెకరాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని జాన్ పీటర్ కు విక్రయించారు.
విషాదమైన వారి ప్రేమ పట్ల రవ్వంత సానుబూతైనా లేని కఠినమైన మతపెద్దలు ఏ ఒక్కరు అక్కడకు రాకపోవడంతో మతపరమైన ప్రార్థనలేవీ లేకనే అరబెల్లాను (ప్రస్తుతం ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలోపల) ఖననం చేశాడు. ఆరబెల్లా కోసం ఇంకా ఏదయినా చేయాలని జాన్ పీటర్ మనసు తీవ్రంగా తపిస్తుండేది. ఏం చేయాలనేది ఒక రూపు వచ్చాక, ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్‌కు వెళ్లాడు. అక్కడ తనకున్న విలువైన ఆస్తులను అమ్మేసి ఆ డబ్బుతో ఇండియాకి వచ్చాడు. బందరులో ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో 18 వేల రూపాయలను వెచ్చించి అరబెల్లా స్మారకార్థం ఒక చర్చిని నిర్మించాడు. ఆ తర్వాత ఆరేళ్లలో (1815 తొలినాళ్లలో) చర్చి నిర్మాణం పూర్తయింది.
ఆరబెల్ల జాన్ పీటర్ ను బౌతికంగా విడిచి ఏడెనిమిదేళ్లు గడుస్తున్నా.. జాన్ పీటర్ ఆరబెల్లాని ఏమాత్రం మరవలేకపోతున్నాడు. ప్రతిరోజూ ఉదయం బందరుకోటలో ఉద్యోగ విధులకు వెళ్లేముందు గుర్రంపై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపేట చర్చ్‌కి వచ్చి అరబెల్లాను చూసేవాడు, అలాగే ఉద్యోగ విధులు ముగిసిన తర్వాత సాయంత్రం మరోమారు ఆమె సమాధి వద్దకు వచ్చి అరబెల్లా మోముని గాజుపేటికలో తనవితీరా చూసుకునేవాడు. చర్చ్‌ని నిర్మించేటప్పుడే భూమి నుంచి ఎప్పుడు కావాలంలే అప్పుడు గాజు పెట్టె పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉండేదంటే… పది అడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్కతో తయారుచేసిన ఒక పావురం బొమ్మని అమర్చారు. ఆ చెక్క పావురాన్ని పట్టుకుని తిప్పితే నేలపై ఉన్న సమాధి గాజు శవపేటిక భూమి నుంచి కింద ఉన్న అమరిక మొత్తం పైకి లేస్తుంది.
జాన్ పీటర్ రోజూ చర్చికి వచ్చి నిచ్చెన వేసుకుని చెక్క పావురాన్ని తిప్పి, గాజు పెట్టెలో ఉన్న అరబెల్లాను కళ్లార్పకుండా చూసుకుని, తిరిగి గాజు పేటికను మూసేసి వెళ్లేవాడు. అలా కొన్నేళ్లపాటు ఇదే ప్రధానమైన దిన చర్యగా మారింది. జాన్ పీటర్ చెన్నైకి బదిలీ అయ్యే వరకు ఇదే వ్యాపకంగా కొనసాగింది. చెన్నైలో ఉద్యోగం చేస్తూ నెలకోసారి బందరు వచ్చి అరబెల్లాను తనివితీరా చూసుకుని గుండెలవిసేలా రోదించేవాడు. అయితే అరబెల్లా కనిపించని చెన్నై నగరంలో పీటర్ ఎక్కువ కాలం జీవించలేకపోయాడు.1817లో తుదిశ్వాస వదిలాడు.
అరబెల్లా జ్ఞాపకాలతోనే జీవించిన జాన్ పీటర్ ను చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది. చెన్నైలో నేటికీ ఉన్న ఆయన పేరున ఒక పార్కు, ఒక రోడ్డు ఉన్నాయి. మచిలీపట్నం – చెన్నపట్నం ఈ అమర ప్రేమికుల ప్రేమకు మౌనసాక్ష్యాలు. అరబెల్లా మరణించిన తర్వాత జాన్ పీటర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదు. జాన్ పీటర్ చెన్నైకి బదిలీ అయి వెళ్లేటప్పుడు ఆ చర్చిను ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేసాడు 1842లో ఆ చర్చ్‌కు సెయింట్ మేరీస్ చర్చ్‌గా పేరు మార్చారు. ఆ నిర్మాణమే అరబెల్లా, పీటర్ లను చిరంజీవులను చేసింది. వీరి ప్రేమను దారుణంగా అణిచివేసిన నాటి మతపెద్దల వారసులు జాన్ పీటర్ నిర్మించిన చర్చిని మాత్రం స్వాధీనం చేసుకొన్నారు.
మచిలీపట్నం వెళ్లిన వాళ్లకు అరబెల్లా చర్చ్ (సెయింట్ మేరీస్ చర్చ్) కనిపిస్తుంది. పీటర్ అమర్చిన పావురం బొమ్మ ఉన్న గోడ కనిపిస్తుంది. దాని మీద అరబెల్లా కోసం రాసిన పాలరాతి ఫలకం కనిపిస్తుంది. ఆమెను ఖననం చేసిన చోటు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరబెల్లా కనిపించదు. ఎందుకంటే… 1960 దశకంలో ఒకసారి చర్చ్ లో సున్నాలు వేస్తున్నారు. పనివాళ్లలో ఒకరు ఆసరా కోసం చెక్క పావురాన్ని పట్టుకొని ఆసక్తిగా ఆ పావురాన్ని అటూ ఇటూ తిప్పారు. ఆ పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వస్తుందనే సంగతి ఆ కార్మికునికి తెలియదు. అనుకోకుండా పావురం బొమ్మను తిప్పగానే అరబెల్లా ఉన్న గాజు పెట్టె సమాధి విచ్చుకొని ఒక్కసారిగా పైకి లేచింది. ఇది చూసిన సున్నం వేసే కార్మికుడు భయంతో అక్కడికక్కడే గుండె ఆగి చనిపోయాడు. దాంతో స్పందించిన అప్పటి కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా మూయించారు. వీరి ప్రేమకు సంబంధించి ఇంకా ఎన్నో వివరాలు నా వద్ద ఉన్నాయి. ఇప్పటికే మినీ నవలగా మారిన ఈ సజీవ ప్రేమ కథకు ఇక్కడతో ముగింపు పలుకుతున్నాను.
– ఎన్. జాన్సన్ జాకబ్
(ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా…)