అబద్ధం వేగంగా వ్యాప్తి చెందినపుడు నిజం నిలకడగా తేలుతుంది అంటుంటాం. వాస్తవమే ఇప్పడు అక్కడ నిజం నిలకడగానే తేలింది. కాకపోతే ఏడున్నర సంవత్సరాల తర్వాత. అసలు నిజం వెలుగులోకి వచ్చాక అన్యాయంగా పొట్టన పెట్టుకున్న 17 మంది ఆదివాసీ గిరిజనుల ప్రాణాలను తిరిగి తీసుకువచ్చెదెవరు? అనే విషయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలింది. అసలు ఈ ‘నిజాల నివేదిక’ లీక్ కావడం వెనుక కాంగ్రెస్ హస్తముందనే భావనతో అక్కడ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్న వైనం. కానీ జరిగిన ఘోరాన్ని తల్చుకుంటేనే గుండె తరుక్కుపోయే అంశమిది. అమాయక ఆదివాసీ గిరిజనుల ఆత్మ ఘోష అప్పుడే కాదు, ఇప్పుడూ అరణ్య రోదనే.
ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురుకాల్పులు జరిగి నక్సలైట్లు మృతి చెందిన ఘటనల్లో పోలీసులు ఏం చెబుతారు? తాము గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమకు అడవుల్లో తారసపడ్డారని, తాము ఎవరని ప్రశ్నించగా, అటువైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని, ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురుకాల్పుల్లో నక్సలైట్లు మృతి చెందారు’ అని చెబుతారు. సాధారణంగా ఎక్కువశాతం ఎన్కౌంటర్ ఘటనల్లో పోలీసులు చెప్పే కథనాల సారాంశం దాదాపుగా ఇదే. తెలంగాణాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాను, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అనుకుని ఉన్న ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 2012 జూన్ 28వ తేదీన ఇటువంటి కథనంతో కూడిన ఎన్కౌంటరే జరిగింది. బీజాపూర్ లోని సర్కేగూడలో మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత గ్రామస్తులు తమపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత తాము జరిపిన ఎదురు కాల్పుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. సర్కేగూడ గ్రామ ప్రజలు ఆ రోజు రాత్రి జరిపిన ‘బీజ్ పందుమ్’ అనే పర్వదినం గురించి చర్చించేందుకు ఓ చోట సమావేశమయ్యారు. అయితే మావోయిస్టుల సమావేశానికి గ్రామాస్తులు హాజరైనట్లు సమాచారం రావడంతో తాము సర్కేగూడకు వెళ్లామని పోలీసులు అప్పట్లో ప్రకటించారు.
ఏడున్నరేళ్ల క్రితం జరిగిన ఈ ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపారు. జ్యుడిషియల్ దర్యాప్తులో పోలీసుల ఘోర తప్పిదం బట్టబయలైంది. అప్పటి ఎన్కౌంటర్లో మృతి చెందిన 17 మంది నక్సలైట్లు కాదని, భద్రతా సిబ్బంది పొరపాటువల్ల అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారని న్యాయ విచారణలోతేలింది. జస్టిస్ వీకే అగర్వాల్ నేతృత్వంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం సర్కేగూడ ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించింది. విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపిన జస్టిస్ అగర్వాల్ కమిషన్ ఎన్కౌంటర్ జరిగిన తీరు, భద్రతా సిబ్బంది పొరపాటు, 17 మంది అమాయక ప్రజలు అసువులు కోల్పోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
అయితే ఈ నివేదిక ప్రస్తుతం లీకైంది. గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బందిపై గ్రామస్తులు ఎటువంటి కాల్పులు జరపలేదని న్యాయ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒకవేళ గ్రామస్థులు కాల్పులు జరిపితే అక్కడే ఉన్న డీఐజీ, డిప్యూటీ కమాండెంట్ వెంటనే స్పందించేవారని, వారి వద్ద ఆయుధాలు కూడా ఉన్నాయని జస్టిస్ అగర్వాల్ కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. ఘటన జరిగినట్లు పేర్కొన్న సమయంలో డీఐజీ, డిప్యూటీ కమాండెంట్ ఎటువంటి కాల్పులు జరపలేదని, అంతేగాక సమావేశం నుంచి ఎలాంటి కాల్పులు గుర్తించలేదని డిఐజీ ఎస్. ఎలాంగో ఆ తర్వాత అంగీకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే భద్రతాసిబ్బంది తమ పొరబాటువల్లనో, కంగారువల్లనో ఎన్కౌంటర్ జరిపినట్లు అర్థమవుతోందని నివేదికలో వెల్లడించినట్లు తెలిసింది. ఘటనలో చనిపోయినవారు మావోయిస్టులని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు కూడా భద్రతాసిబ్బంది వద్ద లేవని జస్టిస్ అగర్వాల్ కమిషన్ పేర్కొంది. చాలా దగ్గర్నుంచి వీరిని కాల్చినట్లు కూడా దర్యాప్తులో తేలిందట.
అయితే ఇప్పడు ఆ 17 మంది ఆదివాసీల ప్రాణాల గురించి ఎవరూ మాట్లాడకపోగా, నివేదిక మీడియాకు లీక్ కావడాన్నే పెద్ద వివాదంగా మారుస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లో అధికారంలోగల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోందట. రమణ్ సింగ్ సారూ…వినిపిస్తోందా? ఆ 17 మంది ఆదివాసీల ఆత్మ ఘోష? ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది తమరే మరి!