ఛత్తీస్ గఢ్ అడవుల్లో గల్లంతైన 17 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో 12 మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన భద్రతా బలగాలుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్ కొద్ది సేపటి క్రితం ధృవీకరించారు. మావోయిస్టు నక్సలైట్లకు, పోలీసులకు మధ్య నిన్న రాత్రి పొద్దుపోయాక జరిగిన భీకర పోరులో కొందరు పోలీసుల ఆచూకీ లేకుండా పోయింది. ఎన్కౌంటర్ సమయంలో గల్లంతైన పోలీసుల సంఖ్య తొలుత 13గా సమాచారం. అయితే మరణించిన పోలీసుల మృతదేహాలు లభ్యమైన అనంతరం వీరి సంఖ్య 17గా ఛత్తీస్ గఢ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో మావోయిస్టు నక్సలైట్ల గాలింపు చర్యలకు దాదాపు 550 మంది భద్రతా బలగాలు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మొత్తం 17 మంది పోలీసులు మరణించగా, గాయపడిన మరో 15 మంది పోలీసులకు రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వీరిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.