తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 11 ఏళ్ల క్రితంనాటి ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. అప్పటి ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయనను ఖమ్మం జైల్లో ఉంచిన నేపథ్యంలో తన తండ్రి పువ్వాడ నాగేశ్వర్ రావు నిర్వహించిన పాత్రను గుర్తుచేస్తూ మంత్రి ఈ పేపర్ క్లిప్పింగును ప్రస్తావించడం గమనార్హం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సందర్భోచితమని న్యూస్ క్లిప్పింగును చూపిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అప్పటి ఈ వార్త క్లిప్పింగ్ గురించి మంత్రి అజయ్ కుమార్ తన అధికారిక వాట్సప్ గ్రూపులో ఏమంటున్నారంటే…. ఆయన మాటల్లోనే దిగువన చదవండి.
‘‘నవంబర్ 28, 2009 న నేటి ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారిని ఆమరణ నిరాహారదీక్ష చేస్తావుంటే సిద్దిపేటలో అరెస్ట్ చేసి సినిమా ఫక్కీలో ఎవరికీ తెలియకుండా ఖమ్మంలో అరెస్ట్ చేసినట్లు చూపించి ఖమ్మం సబ్ జైల్లో నిర్బంధించారు. ఆ సందర్భంలో ఇది అప్రజాస్వామికమని నినదించి ఎక్కడో సిద్దిపేటలో అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో నిర్బంచడం చట్ట వ్యతిరేకమని ఆనాడు సీపీఐ జాతీయ నాయకులు శ్రీ పువ్వాడ నాగేశ్వరావు గారు ఆందోళనలో పాల్గొంటూ మాట్లాడారు. ఈ సందర్బంగా నాటి ఉద్యమ నేతను ఖమ్మం సబ్ జైల్లో నిర్బంధించిననప్పుడు జైల్లోకి వెళ్లి కేసీఆర్ గారిని పలకరించి అనేక అంశాలపై చర్చించి మీకు అండగా ఈ జిల్లాల్లో మేము ఉన్నామానే మనోదేర్యాన్ని కేసీఆర్ గారికి కల్పించి జైలు నుండి శ్రీ పువ్వాడ నాగేశ్వరావు గారు బయటకి వస్తున్న సందర్భంలో ఆ నాటి పత్రికల్లో వచ్చిన వార్తను ఈ రోజు సందర్భోచితమని చూపిస్తున్నాను.’’