పదకొండు మంది గిరిజనులు మావోయిస్టు నక్సలైట్ల చెరలో చిక్కారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా జేగురుగొండలో జరిగిన గిరిజన యువకుల కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలానికి దారి తీసింది. పోలీసు రిక్రూట్ మెంట్ కోసం వెళ్లారనే కారణంతో జేగురుగొండకు చెందిన ఏడుగురు యువకులను నక్సలైట్లు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. దీంతో వారిని కాపాడేందుకు వెళ్లిన మరో నలుగురు వ్యక్తులు కూడా అదృశ్యం కావడం గమనార్హం.

మొత్తం 11 మంది గిరిజనులు నక్సలైట్ల చెరలోనే ఉన్నట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పోలీసు శాఖలో చేరవద్దని హెచ్చరించి వారిని నక్సలైట్లు వదిలేస్తారనే ఆశాభావం కూడా స్థానిక గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. తమ వాళ్లకు ఎటువంటి హాని తలపెట్ట వద్దని కిడ్నాప్ నకు గురైన యువకుల కుటుంబాలు నక్సలైట్లను వేడుకుంటున్నాయి.

కాగా బీజాపూర్ జిల్లా గంగళూరులో వింజమ్ రామ్ అనే మాజీ నక్సలైట్ ను మవోయిస్టులు దారుణంగా హత్య చేశారు. తొమ్మిదేళ్లపాటు మావోయిస్టు పార్టీలోనే పనిచేసిన వింజమ్ రామ్ ఆ తర్వాత ప్రభుత్వానికి లొంగిపోయాడు. పదేరాలోని వార సంతకు వెళ్లిన వింజమ్ రామ్ ను నక్సలైట్లు కిడ్నాప్ చేసి హత్య చేశారు. అతని డెడ్ బాడీని రోడ్డుపై పడేశారు.

Comments are closed.

Exit mobile version