కరోనా మహమ్మారికి పది మంది నక్సలైట్లు బలయ్యారా? అనే ప్రశ్నకు ఔనని నివేదిస్తోంది ఛత్తీస్ గఢ్ మీడియా. ఆ రాష్ట్ర మీడియా వర్గాల కథనం ప్రకారం… దంతెవాడ జిల్లాలో కరోనా మావోయిస్టు పార్టీ నక్సలైట్లను చుట్టుముట్టింది. కరోనా వైరస్ వల్లనేకాక, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 10 మంది నక్సలైట్లు మరణించినట్లు ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ మీడియా సంస్థ నివేదించిన వార్తలను బట్టి తెలుస్తోంది. కరోనా కారణంగా నక్సలైట్లు మరణించారనే విషయాన్ని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ధృవీకరించినట్లు కూడా అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. దంతెవాడ జిల్లాలో నక్సలైట్లు అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చాయని, ఇదే దశలో మావోయిస్టుల మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థ ‘బస్తర్ కీ ఆవాజ్’ పేర్కొంది. అయితే ఈ సంస్థ నివేదించిన వార్తా కథనంలో ఓ వైపు కరోనా, మరోవైపు ఫుడ్ పాయిజన్ అనే రెండు అంశాలు దాగి ఉండడం గమనార్హం.