మినీ మున్సిపల్ పోరులో ఖమ్మం ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రతిన బూనిన భారతీయ జనతా పార్టీలో రాజకీయ కలకలానికి దారి తీసిన ఘటన ఇది. అధికార పార్టీని ఎదుర్కుని బీజేపీ ఎన్ని డివిజన్లలో విజయం సాధిస్తుందనే ప్రశ్న సంగతి ఎలా ఉన్నప్పటికీ, తనచేత బలవంతంగా ‘ఉపసంహరణ’ పత్రాలపై బీజేపీ నేతలే సంతకాలు చేయించారని మహిళా అభ్యర్థి ఒకరు ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో సంచలనం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెడితే… ఖమ్మం కార్పొరేషన్ లో బీజేపీ-జనసేన పార్టీలు కలసి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నాయనే వివరాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, 15వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎనుగంటి నాగరాణి నామినేషన్ ను ఆ పార్టీ నేతలే బలవంతంగా ఉపసంహరింపజేసినట్లు వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీ ఫారం ఇస్తామని చెప్పి తనచేత బలవంతంగా విత్ డ్రా కాగితాలపై సంతకాలు చేయించినట్లు నాగరాణి ఆరోపిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా బరిలో నిలబడి పోరాడేదాన్నని ఆమె చెబుతున్నారు. ప్రత్యర్థులకు అంతగా భయపడేవారు ఖమ్మంలో బీజేపీ ఆఫీసును తీసివేసుకోవాలని నాగరాణి ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈమె చేత బీజేపీ నేతలే విత్ డ్రా చేయించడం వల్ల ప్రస్తుతం 15వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండాపోవడం గమనార్హం. ఈ ఘటనపై బీజేపీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా నాగరాణి ఉదంతంపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవిని వివరణ కోరగా, ఆమె చేత నామినేషన్ ను ఉపసంహరింపజేయాలని పార్టీ పెద్దలే ఆదేశించారని చెప్పారు. పార్టీ నాయకత్వం ఆదేశం మేరకే అలా వ్యవహరించామన్నారు. పార్టీ తరపున నామినేషన్ వేయడం వల్లనే ఆమె చేత విత్ డ్రా చేయించడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పార్టీ పెద్దల నిర్ణయం మేరకే నాగరాణి చేత నామినేషన్ ను విత్ డ్రా చేయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
కాగా ఈ ఘటనపై నాగరాణి ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోను దిగువన చూడవచ్చు.