అక్యూజ్డ్ నెం. 2… అంటే రెండో నిందితుడు. పాత పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యోదంతంలో నమోదైన కేసులో రెండో నిందితుడైన వనమా రాఘవేందర్ రావు ఆచూకీ ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు రాఘవేందర్ రావు పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వనమా రాఘవగానూ ప్రాచుర్యం పొందిన రాఘవేందర్ రావు లొకేషన్ కోసం ట్రేసవుట్ చేస్తున్నామని, అతని కోసం స్పెషల్ టీంలు గాలిస్తున్నాయని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే వనమా రాఘవపై గతంలో వచ్చిన ఆరోపణలకు సంంధించిన ఘన కార్యాలపైనా భిన్నవార్తలు వస్తుండడం గమనార్హం. తాము పంచాయతీలు చేస్తున్న మాట వాస్తవమేనని సెల్ఫీ వీడియోలో పరోక్షంగా అంగీకరించిన వనమా రాఘవ ఘనకీర్తి తాలూకు అనేక ఘటనలు తాజాగానూ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పాల్వంచ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలోనే రాఘవపై ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదైన దాఖలాలు ఉన్నాయి. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు కాగా, అందులో ఒకటి ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు, మరొకటి ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.

అదేవిధంగా ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారని 2006లో, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని 2017లో, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు 2020లో, ఒకరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగంపై 2021లో వనమా రాఘవపై పాల్వంచ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఘటనలో వనమా రాఘవను ఏ2గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతం జరిగి రెండు రోజులవుతున్నా వనమా రాఘవ ఆచూకీని పోలీసులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే వనమా రాఘవ చుట్టూ పోలీసు శాఖ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. రామకృష్ణ కుటుంబం ఘటనలో మరిన్ని బలమైన సాక్ష్యాల కోసం పోలీసులు పరిశోధన చేస్తున్నారనే ప్రచారం మరోవైపు జరుగుతోంది. మరిన్ని బలమైన ఆధారాలను సేకరించాకే రాఘవను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం పరారీలో గల వనమా రాఘవ యాంటిసిపెటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఓ వైపు సెల్ఫీ వీడియోలను విడుదల చేస్తూ, ఇంకోవైపు న్యూస్ ఛానళ్ల ద్వారా తన వాదనను వినిపిస్తున్న వనమా రాఘవ ఇటువంటి ఘటనల సందర్భాల్లో అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది మొదటిసారి కాకపోవడం గమనార్హం. పాల్వంచకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో ఎ-1గా ఆరోపణలు ఎదుర్కొన్న వనమా రాఘవ సుమారు 20 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో స్క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసి ఉపశమనం పొందినట్లు వార్తలు వచ్చాయి. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెబుతున్న వనమా రాఘవ వారికి అందుబాటులో లేకుండా పరారీ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments are closed.

Exit mobile version