మావోయిస్టు పార్టీ అగ్ర నేత ఒకరు వరంగల్ పోలీసులకు చిక్కారు. ఆ పార్టీ దండకారణ్య స్పోషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శోబ్రాయ్ తోపాటు మైనర్ కొరియర్ కూడా అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. కరోనా బారినపడ్డ మధుకర్ చికిత్స కోసం రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం…
బుధవారం తెల్లవారుజామున లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అనుమానాస్పదంగా ములుగు నుండి వస్తున్న కారును పోలీసులు తనీఖీ చేయగా, కారు వెనుక భాగంలో వున్న వ్యక్తిని అదుపులోకి విచారించగా, నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్ గా గుర్తించారు. అతనితోపాటు మావోయిస్టు పార్టీ మైనర్ కొరియర్ ను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్టు చేసిన దండకారణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ కొండపల్లి గ్రామం, బెజ్జూర్ మండలం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినవాడు, ఇతను ఒకప్పటి పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1999 సంవత్సరంలో సిర్పూర్ దళంలో చేరాడు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. అనంతరం పార్టీ అదేశాల మేరకు గడ్డం మధుకర్ 2000వ సంవత్సరంలో దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీకి బదిలీ అయ్యాడు. అప్పటినుండి మావోయిస్టు పార్టీ కేంద్ర విభాగానికి చెందిన అగ్రనాయకులు నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు, పుల్లూరి ప్రసాద్ రావు ఆలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవోజీ, యాప నారయణ ఆలియాస్ హరిభూషణ్, హిడుమ ఆదేశాల మేరకు ఛత్తీస్ ఘడ్ పలు విధ్వంసకర సంఘటల్లో పాల్గొనటంతో పాటు పలు మంది పోలీసులను హత్య చేసి వారి అయుధాలను అపహరించిన కేసుల్లో మధుకర్ నిందితుడు.
అదేవిధంగా పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ కొరియర్ ( ఇతను మైనర్ కావడంతో వివరాలను వెల్లడించడం వీలుకాదు) పాల్ టెక్నిక్ డిప్లోమో చదువును మధ్యలోనే అపివేసి ఉపాధికోసం కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. ఇదే సమయంలో ఈ మైనర్ కొరియర్ కి జశ్వంత్ అనే మిత్రుడి ద్వారా ఓ భూ తగాదా విషయంలో మావోయిస్టు పార్టీ కొరియర్ నామిండ్ల నరేష్ తో పరిచయం అయింది. మావోయిస్టు పార్టీలో కోవిడ్ తో భాధపడుతున్న మావోయిస్టుకు మెరుగైన చికిత్స కోసం హన్మకొండలో ఏదైనా హాస్పిటల్ లో చేర్పించాల్సిందిగా కొరియర్ నరేష్ ఈ మైనర్ కోరియర్ కి సెల్ ఫోన్ ద్వారా గత నెల 31న సూచించాడు. ఈ నేపథ్యంలోనే మైనర్ కొరియర్ ఏటూరునాగారం మీదుగా కారులో బయలుదేరి వెళ్లి వెంకటాపూర్ అటవీ ప్రాంతం నుండి కోవిడ్ తో భాధపడుతున్న మావోయిస్టు గడ్డం మధుకర్ ను కారు వెనుక భాగం పడుకోబెట్టి హన్మకొండకు తీసుకవస్తున్న క్రమంలో పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. ఈ సందర్భంగా వారి వద్దనున్న 88,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు కోవిడ్ తో భాధపడుతూ చాలా నీరసంగా వున్న మావోయిస్టు నేత గడ్డం మధును పోలీసులు మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పిటల్ లో చేర్పించినట్లు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.