కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యోదంతంలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన లేఖ, విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో రాఘవపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వనమా రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే నిన్న వనమా రాఘవ అరెస్టయినట్లు వచ్చిన వార్తలను పోలీసుల ధ్రువీకరించలేదు. రాఘవ తమ అదుపులో లేడని, అతని కోసం స్పెషల్ టీంలు గాలిస్తున్నాయని, త్వరలోనే పట్టుకుంటామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. ఈ పరిణామాల్లోనే రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించడం విశేషం. వనమా రాఘవకు టీఆర్ఎస్ పార్టీలో ఏ హోదా లేకపోవడం గమనార్హం.