మధిర మున్సిపల్ కౌన్సిలర్, టీఆర్ఎస్ లీడర్ మల్లాది వాసుకు ఉచ్చు బిగుస్తున్నట్లు సమాచారం. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను భౌతికంగా నిర్మూలించేందుకు తాను రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తానని మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మల్లాది వాసు వ్యాఖ్యలపై విజయవాడకు చెందిన డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యేలను భౌతికంగా నిర్మూలించేందుకు రూ. 50 లక్షలు ఇస్తానని ఓ వ్యక్తి ప్రజా సమూహంలో ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అతను చేసిన వ్యాఖ్యల వీడియోను తాను సోషల్ మీడియాలో చూశానని, అందుకు సంబంధించిన వీడియో లింక్ ను జత చేస్తున్నానని, ఆయా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మల్లాది వాసు చేసిన రూ. 50 లక్షల ఆఫర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది. ‘పొలిటికల్ కన్సెషన్ ఏముండదు వాసూ. కావాలంటే నిన్ను ఫ్రీగా వేసేస్తా…’ అనే వ్యాఖ్యను జోడించి ‘అతడు’ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ కు అనుగుణంగా ట్రోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు మల్లాది వాసు ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో ‘50 లక్షలు ఇస్తావు సరే, ఫోన్ ఆన్ చెయ్యి… తీసుకునే వాళ్లు చేస్తారు మరి’ అంటూ సోషల్ మీడియా కార్యకర్తలు వెటకరిస్తున్నారు.

కాగా మల్లాది వాసుపై గుంటూరు జిల్లాలో పలువురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసులు కూడా నమోదయ్యాయనే వార్తలు ధ్రువపడలేదు. అధికారికంగా ఎటువంటి సమాచారం కూడా లేదు. మరోవైపు మల్లాది వాసు ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, ఆయన మధిర నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version