ఫొటోలో మీరు చూస్తున్న 18 నెలల ఈ బాలుడి పేరు దీప్ జలి సాహు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన శివకుమార్ సాహు దంపతుల సంతానం. అదేమిటీ ఇతనికి మూడు చేతులు ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? శివకుమార్ సాహు దంపతులు కూడా తమ బిడ్డ భౌతిక స్థితిని చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పుట్టుకతోనే దీప్ జలికి మూడు చేతులు ఉండడమే ఇందుకు కారణం.
తమ బిడ్డకు చికిత్స చేయించేందుకు శివకుమార్ సాహు దంపతులు అనేక అసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఎటువంటి ప్రయోజనం లభించలేదు. చివరికి తమ పిల్లాడిని వెంటబెట్టుకుని ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లోని డీకేఎస్ సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఆశ్రయించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోని డాక్టర్ నితిన్ శర్మ పిల్లవాడి స్థితిని నిశితంగా పరీక్షించారు. అనంతరం తన సహ డాక్టర్లతో కలిసి దీప్ జలికి చాకచక్యంగా ఆపరేషన్ చేశారు. దీప్ జలికి గల అదనపు చేతిని వేరు చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది అద్భుతమైన ఆపరేషన్ గా డాక్టర్ల బృందం అభివర్ణించింది. ఇది పరాన్నజీవి కవలల్లో ఏర్పడే వైకల్యమని డాక్టర్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
-‘బస్తర్ కీ ఆవాజ్’ సౌజన్యంతో…