సింహానికి మృగరాజు అని పేరు ఉంది. సింహం పంజా దెబ్బ 1,200 కిలోల బరువు ఉంటుందని అంచనా. అలాగే తన నోటి బైట్ చాలా బలంగా ఉంటుంది. దాదాపు 13 సెం.మీ వరకు కోరలు, బ్లేడ్ లాంటి స్లెడ్జ్ హామర్ పంజా ఉంటుంది. బైబిల్ లో పలుమార్లు సింహం ప్రస్తావన లిఖితమైంది. డేనియల్ ను సింహం బోనులో బంధించినపుడు దేవదూత వాటి నోళ్లను బంధించి తన భక్తుడిని దేవుడు రక్షించుకొన్నారు.

అలాగే సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ అకస్మాత్తుగా సమ్సోను ను ఆవరించింది . దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు సింహం నోటిని చీల్చి చంపెను. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.

సింహాన్ని చూసి నక్క వాతలుపెట్టుకున్నట్లు ఆ భక్తులతో పోల్చుకొని భంగపడుతున్నారు. క్రూర మృగాలతో విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టి తమ ఘనత చాటాలని యత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. ఆమధ్య దక్షిణాఫ్రికాలో జియాన్ క్రిస్టియన్ చర్చి పాస్టర్లంతా సింహాలు వుండే క్రూగర్ నేషనల్ సఫారి పార్క్ కు వెళ్ళారు. సింహాల తరపున పాస్టర్లు దేవుణ్ణి ప్రార్థిస్తారేమోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు!

తనను తాను డేనియల్ మాదిరిగా ఊహించుకొని పాస్టర్ అలెక్ ఎండివాన్ ను తోటి పాస్టర్లు ఆపినా ఆగకుండా సింహాలవైపు నడిచాడు. దేవుడు తనయందు వున్నాడన్నాడు. సింహాలయందు కూడా దేవుడు వుంటాడని మిగతా పాస్టర్లు చెప్పిచూసారు. నేను దేవుని ప్రతినిధిని అని ఎండివాన్ యెంతో గర్వంగా చూసాడు దేవుడు నన్ను సింహాల నుండి రక్షిస్తాడని నమ్మకంగా చెప్పాడు!

పాస్టర్లంతా దేవుణ్ణి ప్రార్ధించడం మాని ఎండిమాన్ ని ప్రార్ధించారు అవి సింహాలని.. దేవుడు చెప్పినా వినవని.. మొత్తుకున్నారు! దేవుడు చెపితే యెవరన్నా వినవలసిందే.. సింహాల్లారా.. మీరయినా వినవలసిందే.. అని సింహాలకు అరిచి మరీ చెప్పాడు ఎండిమాన్ అరుపులు విన్న సింహాలు మాంసము తినడం మాని తోకూపుతూ ఎండిమాన్ ను ఆశగా చూసాయి దేవుని వాక్యము మీరు కాదనగలరా? అని మరోమారు అరిచాడు ఎండిమాన్.. సింహాలు లేచి నిలబడ్డాయి.. అదీ గౌరమంటే ఆని మురిసిపోయాడు ఎండిమాన్ దేవుణ్ణి ప్రార్ధిస్తూ సింహాలకు యెదురెళ్ళాడు.

ఎండిమాన్ ని మిగతా పాస్టర్లు తమ వాహనం లోనికి రమ్మని ప్రాధేయపడ్డారు. దేవుణ్ణి అవమానించొద్దన్నాడు ఎండిమాన్ దేవుడు గొప్పో సింహాలు గొప్పో తేలిపోతుంది అని గంతులు వేసాడు. నాది దేవుని త్రోవ అన్నాడు.. సింహాలు త్రోవకు దగ్గరగా వచ్చేస్తున్నాయి! దేవుని త్రోవను అనుసరించలేక తోటి పాస్టర్లు వెంటనే వెనక్కి వచ్చి వాహనం ఎ క్కారు. ఎండిమాన్ కూ సింహాలకూ వున్న మధ్య దూరం క్షణాల్లో తగ్గుతోంది!

దేవుడా.. నువ్వే గనక వుంటే సింహాల గుంపు నన్నేమీ చెయ్యబోవు గాక.. అని నినదించాడు ఎండిమాన్! సింహాలు జూలుదులుపుకు పరిగెత్తుకువచ్చాయి! అంతవరకూ వున్న సింహాలు సింహాలుగా కాక, వొక్కసారిగా మీదకోస్తున్న సైతానుల్లా కనిపించాయి అంతే-
దేవుడా.. అని ఎండిమాన్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు.. సింహాలు ఆగిపోలేదు.. పరిగెత్తుతూ వచ్చేసాయి.. సింహాలకన్నా వేగంగా పరిగెత్తలేకపోయాడు.. సింహాల పంజా దెబ్బలకు రక్తంతో అతని పిరుదులు వరదలు గట్టాయి. సమయానికి సఫారీ పార్క్ సిబ్బంది వచ్చి తుపాకులు పేల్చుతూ సింహాల బారినుండి ఎండిమాన్ ను కాపాడారు. ఎండిమాన్ ని పరామర్శించడానికి చాలా మంది భక్తులూ తోటి పాస్టర్లు వచ్చారు.

ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎండిమాన్ ‘బహుశా.. జంతువులపై తన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకే దేవుడు నన్ను వాడుకొని వుంటాడు’ అని తనని తాను సమర్ధించుకున్నాడు! తోటి పాస్టర్లు ఎండిమాన్ కు తలమీద కూడా దెబ్బ తగిలిందేమోనని కలవరపడి డాక్టర్లని చూడమన్నారు! అలాంటిదేమీ లేదని డాక్టర్లు చెప్పారు. ఇటీవల మరొక సింహబలుడు స్నేహితులను మొబైల్ లో వీడియో తీయమని చెప్పి జూ పార్క్ లో సింహాల ఉండే ప్రహరీ గోడపై ఎగబాకాడు. ఈలోపు ఒక సింహం ఇనుప ఊచల నుండి అతని కాలును కారప్పూస మాదిరిగా నమిలింది.. పాపం అతని స్నేహితులు పొడవైన చువ్వతో సింహం కంటిలో పొడుస్తున్నప్పటికీ మరో కాలును కర కర నమలసాగింది..నరమాంసం ఇస్టపడి నడుం భాగం వరకు తినిన ఆ సింహం వదిలినా ఆ వ్యక్తి బతికి బట్ట కట్టే ఛాన్స్ లేదు !! సాహసాలు వికటిస్తే… విషాదాలుగా మిగులుతాయి.

✍️ ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం

Comments are closed.

Exit mobile version