కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో, అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటి పారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, వచ్చే ఎండాకాలం అంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు.
మంగళవారం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రులు,ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను నెమరు వేసున్నారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రాణహిత గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద గోదావరికి పుష్పాంజలి ఘటించారు. పసుపు. కుంకుమను, నాణాలను నీటిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం తదనంతర నిర్మాణం సందర్భంగా ఎదుర్కున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణా రైతన్నకు వెన్ను దన్నుగా నిలుస్తూ తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్న ప్రాణహిత గోదావరి జల దృశ్యాన్ని చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికార్లు శక్తి వంచన లేకుండా కృషి చేశారని అభినందించారు.