దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భలే ‘లాజిక్’గా వాదిస్తుంటారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు ఇచ్చే హామీల్లోని లొసుగులను వెతికి మరీ పట్టుకుని తర్కిస్తుంటారు. విషయం నిజమే కాబోలునని నమ్మేవారిలో సరికొత్త సందేహాన్ని కలిగిస్తుంటారు. రఘునందన్ రావు ‘వకీల్ సాబ్’ కదా..? ఈ విషయంలో ఆయన శైలే వేరు. న్యూస్ ఛానళ్ల చర్చల్లోగాని, ఇతరత్రా సభల్లో, సమావేశాల్లోగాని రఘునందన్ రావు చేసే తర్కం ముందు ఆయనతో వాదనకు దిగేవారు ఎక్కువ సందర్భాల్లో నోరెళ్లబెట్టాల్సిందే. అనేక అంశాల్లో ఇది ప్రస్ఫుటమైంది కూడా.

ఇంతకీ రఘునందన్ రావు తాజా వాదన ఏమిటంటే… సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ నిన్నగాక, మొన్ననే ప్రకటించిన విషయం విదితమే. కొన్ని ప్రముఖ పత్రికలైతే సీఎం ప్రకటించిన సిద్ధిపేట అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘రీజనల్’ అనే పదాన్ని కూడా ముందు తగిలించి మరీ సబ్ హెడ్డింగులను తమ పాఠకులకు వడ్డించాయి. ఇదిగో ఈ సిద్ధిపేట ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ హామీ గురించే రఘునందన్ రావు పొలిటికల్ ‘లా’ పాయింట్ పట్టుకున్నారు.

అసలు సిద్ధిపేటకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎలా సాధ్యమనేది రఘునందన్ రావు లేవనెత్తిన వాదన. కేసీఆర్ సార్ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడే పౌర విమానయాన శాఖ ‘జీఎంఆర్’ సంస్థతో ఓ కీలక ఒప్పందం చేసుకుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటైన సందర్భంగా వచ్చే పాతికేళ్లవరకు 150 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయకూడదని 2004లోనే జీఎంఆర్ సంస్థ విధించిన షరతుగా రఘునందన్ రావు ఉటంకించారు.

త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఆచరణ సాధ్యంకాని హామీని సీఎం కేసీఆర్ ఇచ్చారని రఘునందర్ రావు విమర్శ. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు హామీ ఇంచు కూడా ముందుకు కదల్లేదని కూడా రఘునందన్ రావు గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చే ఇటువంటి హామీలపై టీఆర్ఎస్ శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్లు చేసే వాదన కూడా ఆసక్తికరంగానే ఉండొచ్చు. ‘దశాబ్ధాలుగా అసాధ్యమని భావించిన తెలంగాణా రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ సార్ కు సిద్ధిపేట విమానాశ్రయాన్ని తీసుకురావడం పెద్ద సమస్యా? జాతీయ రాజకీయాల్లో అడుగిడి ‘ఫ్రంట్’ స్థాపించి దేశాన్నే పరిపాలించేందుకు సిద్ధపడుతున్న తమ నాయకుడు కేసీఆర్ తల్చుకుంటే సిద్ధిపేట ఎయిర్ పోర్ట్ సాధన ఓ లెక్కా? సిద్ధిపేట విమనాశ్రయం పక్కా…’ అని గులాబీ శ్రేణులు వకీల్ సాబ్ వాదనకు అడ్డుతగలే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు మార్గంలో దూరం ఎంతో తెలుసా…? దాదాపు 100 కిలోమీటర్లు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకైతే 123 కిలోమీటర్లు. అంటే సిద్దిపేటకు మరో 27 కిలోమీటర్ల అవతలి ప్రాంతంలో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించుకోవచ్చు. అంటే కరీంనగర్-సిద్ధిపేట మధ్య గల దాదాపు 50 కిలోమీటర్ల మధ్య దూరంలో ఎక్కడైనా ఈ ఎయిర్ పోర్ట్ నిర్మించుకునే వెసులుబాటు ఉన్నట్లే. ఇందుకు జీఎంఆర్ ఒప్పందం అడ్డు కూడా కాకపోవచ్చు. సరే, దీని సాధ్యాసాధ్యాలపై భిన్న వాదనల సంగతి ఎలా ఉన్నప్పటికీ, సిద్దిపేట ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తెగ నవ్విస్తున్నారు. అందుకు సంబంధించిన ‘పోస్ట్’లను కూడా ఇక్కడ చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version