తెలంగాణాలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల పలితాల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాష్ట్ర స్థాయి పొలిటికల్ హీరోగా నిలిచారు. రాష్ట్ర స్థాయి రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో చైర్మన్ పదవిని అధిష్టించేందుకు మేజిక్ ఫిగర్ కు సరిపడా స్థానాలు గెలవడం విజయం మాత్రమే కావచ్చు. కానీ ఏ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కకుండా తమ పరిధిలోని మున్సిపాల్టీల్లో ఏకపక్షంగా, గంపగుత్తగా వార్డుల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమంటే ఆషామాషీ వ్యవహారం కాకపోవచ్చు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులనే కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా చోటు దక్కకుండా, అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే విజయం సాధించిన చరిత్ర రాష్ట్రంలో కేవలం రెండే రెండు మున్సిపాల్టీలకు దక్కిందని చెప్పక తప్పదు. అందులో సత్తుపల్లి ఒకటి. (ఈ వార్త రాస్తున్న సమయానికి అందిన సమాచారం ప్రకారం మాత్రమే ఈ విశ్లేషణను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉండగా, 22 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. ఇండిపెండెంట్ గా ఇక్కడి 9వ వార్డు నుంచి గెలుపొందిన ఎన్. జయమ్మ అనే అభ్యర్థి కూడా వాస్తవానికి అధికార పార్టీ అభ్యర్థే. కాకపోతే నిర్దేశిత గడువులోపు ఆమెకు బీ.ఫారం అందకపోవడంతో సాంకేతికంగా స్వతంత్ర అభ్యర్థిగానే మిగిలారు. కారు గుర్తుపై ఈ వార్డులో మరే అభ్యర్థి పోటీలో లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్రంలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లో భీమ్ గల్ ఫలితాల్లోనూ అధికార పార్టీ నూటికి నూరు శాతం సీట్లను దక్కించుకుంది. ఇక్కడ గల 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. భీమ్ గల్ మున్సిపాలిటీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉంది. కానీ ఆయన మంత్రి హోదాలో ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాత్రం మంత్రి హోదాలో లేకపోవడం గమనార్హం. ఆయన కేవలం ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపును సత్తుపల్లి నుంచి గెల్చిన వెంకట వీరయ్య తన నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ ఫలితాల్లో నూటికి నూరుశాతం విజయాన్ని సొంతం చేసుకోవడమే ప్రత్యేకత. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోకపోయినా, కేసీఆర్ కు జైకొట్టిన పరిస్థితుల్లోనూ సత్తుపల్లిలో రాజకీయంగా తన పట్టు ఏమాత్రం సడలలేదని సండ్ర ఈ ఫలితాల ద్వారా నిరూపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు శనివారం నాటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్టేట్ టాప్ పొలిటికల్ హీరో సండ్ర వెంకట వీరయ్య మాత్రమేనని చెప్పక తప్పదు. ఎన్నికల ఫలితాల వివరాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.