బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విషయంలో ‘సాక్షి’ దినపత్రిక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సంజయ్ కు సంబంధించిన వార్తలపై భారీ ‘కత్తెర’ వేస్తున్నది. సాక్షి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేందుకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి కూడా. నిన్నటి ఖమ్మం పర్యటనకు సంబంధించి బండి సంజయ్ వార్తలకు ‘సాక్షి’ దినపత్రిక పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అంశంపై ఇంతకు ముందు కథనంలో చెప్పుకున్నాం కదా? ts29.in ప్రచురించిన ఈ వార్తా కథనంపై సాక్షి పత్రిక వర్గాలు స్పందించడం విశేషం. వాట్సప్ కాల్ ద్వారా ts29తో మాట్లాడిన ‘సాక్షి’ ముఖ్య బాధ్యుడొకరు సంజయ్ తీరుపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంజయ్ కు ‘సాక్షి’ పత్రిక ఎంత భారీ ఎత్తున కవరేజీ ఇచ్చిందో మీకు తెలియదా? అని ఆయన ప్రశ్నిస్తూ, అసలు కారణాన్ని అన్యాపదేశంగానే వెల్లడించడం విశేషం. ఈ విషయాన్ని సాక్షి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, సంజయ్ వార్తలపై ఓ రకంగా అప్రకటిత పాక్షిక నిషేధం విధించినట్లుగానే భావించవచ్చు.
ఈనెల 5వ తేదీన వరంగల్ మహానగరంలో పర్యటించిన సమయంలోనూ బండి సంజయ్ వార్తలకు ‘సాక్షి’ పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. సంజయ్ పర్యటన వార్తలను కేవలం జిల్లా ఎడిషన్ కు పరిమితం చేయడమే కాదు, అందులోనూ లోపలి పేజీల్లో మాత్రమే ప్రచురిస్తుండడం గమనించాల్సిన అంశం. నిన్నటి ఖమ్మం పర్యటనకు సంబంధించి కూడా సంజయ్ వార్తలకు ‘సాక్షి’ సముచిత స్థానం కల్పించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అందునా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో మాంచి జోష్ లో గల బండి సంజయ్ వార్తలను సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురించకపోవడం, కేవలం జిల్లా ఎడిషన్లకే, అందులోనూ లోపలి పేజీలకే పరిమితం చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇంతకీ బండి సంజయ్ పై ‘సాక్షి’ యాజమాన్యానికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? అది తెలియాలంటే ముందు దిగువన గల ఈ క్లిప్పింగును చూడండి.
విషయం అర్థమైనట్లే కదా! ఈనెల 4వ తేదీన బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివి. సంజయ్ పై ‘సాక్షి’ కోపానికి ఈ వ్యాఖ్యలే ప్రధాన కారణమట. ‘బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? అని సంజయ్ మాట్లాడితే ‘సాక్షి’ యాజమాన్యానికి కోపం రాదా? అనే వాదన వినిపిస్తోంది. అందుకే సంజయ్ వార్తలకు సాక్షిలో ప్రాధాన్యతను తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు సాక్షి సిబ్బందికి ఆదేశాలు అందినట్లు కూడా ఈ ప్రచారపు సారాంశం. తన నాయకత్వం లేని పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టి, సాక్షి యాజమాన్యపు ఆగ్రహాన్ని చవిచూస్తున్న బండి సంజయ్ ఈ అంశం నుంచి ఎలా బయటపడతారో చూడాల్సిందే!