తెలంగాణా రెవెన్యూ ఉద్యోగుల విభజన దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర శాఖల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ, రెవెన్యూ శాఖలోని తహశీల్దార్ల, డిప్యూటీ తహశీల్దార్ల, సీనియర్ అసిస్టెంట్ల విభజన, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వు వెలువడలేదు. దీంతో రెవెన్యూ విభాగంలోని ఆయా ఉద్యోగ వర్గాలు తీవ్ర ఉత్కంఠతో ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నాయి.

ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈనెల 15వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. తొలుత జోన్, ఆ తర్వాత మల్టీ జోన్ లోకి ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితాను, ఉద్యోగుల ఆప్షన్లు తదితర ప్రక్రియను పూర్తి చేశారు. జాబితాలను కూడా సంబంధిత జిల్లాల కలెక్టర్లు సీసీఎల్ ఏకు పంపించారు.

అయితే తహశీల్దార్ల, డిప్యూటీ తహశీల్దార్ల, సీనియర్ అసిస్టెంట్ల విభజన, బదిలీ ఉత్తర్వుకు సంబంధించిన కీలక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై సమాచారం అత్యంత రహస్యంగా ఉందంటున్నారు.

ఈ నేపథ్యంలోనే విభజన, బదిలీ ఉత్తర్వు కోసం తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు,, సీనియర్ అసిస్టెంట్లు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే విభజన, బదిలీకి సంబంధించి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, సీనియర్లు, జూనియర్లు ప్రాతిపదికన ప్రతి జిల్లాకు కనీసం అయిదారుగురు తహశీల్దార్లకు మాత్రమే స్థానం చలనం ఉండవచ్చని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈనెల 31వ తేదీ రాత్రి కల్లా ఇందుకు సంబంధించిన ఉత్తర్వు వెలువడవచ్చని సమాచారం. లేదంటే జనవరి 3వ తేదీన ఉత్తర్వు వెలువడడం ఖాయంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. విభజన, బదిలీల ప్రక్రియను పూర్తి చేశారని, ఉత్తర్వు ఏ క్షణమైనా వెలువడవచ్చని రెవెన్యూ ఉద్యోగ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొత్త సంవత్సర వేడుకల జోష్ సంగతి ఎలా ఉన్నప్పటికీ, తాము మాత్రం విభజన, బదిలీ ఉత్తర్వులపై ఉత్కంఠను ఎదుర్కుంటున్నట్లు రెవెన్యూ అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version