కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై పోలీసులు చేయి చేసుకున్నారా? ఔననే అంటున్నారు ప్రియాంక గాంధీ. ఈమేరకు లక్నో పోలీసులపై ఆమె ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంగా అరెస్టయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారపురి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక బయలు దేరారు. అయితే ఆమె వెడుతున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తనను అడ్డుకున్న పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ప్రియాంక నిరసనకు దిగారు. అనంతరం పార్టీ కార్యకర్తకు చెందిన బైక్ పై ఆమె ప్రయాణిస్తుండగా పోలీసులు అమెను మరోసారి నిలువరించారు. దీంతో చేసేది లేక ప్రియాంక కాలినడకనే దారపురి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు.
ఈ ఘటన సందర్భంగా ప్రియాంక పోలీసుల తీరుపై ఆగ్రహించారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని కూడా ప్రియాంక తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి కూడా చేశారని ప్రియాంక ఆరోపించారు. ముగ్గురికంటే తనతో ఎక్కువగా లేరని, శాంతి భద్రతలకు ఎలా భంగం కలుగుతుందని అన్నారు. తనను ఆపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రియాంక ఈ సందర్భంగా ప్రశ్నించారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని ప్రియాంక చేసిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.