తనను లక్ష్యంగా చేసుకుని ఓ లారీ తన కారును ఢీకొట్టిందని హైకోర్టు న్యాయవాది మండూరి దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. లాయర్లకు భద్రత లేకుండాపోయిందని, ఇలాగైతే అడ్వకేట్ వృత్తిని వదిలేసి పొలం పనులు చేసుకోవలసి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ భూ వివాద కేసును వాదించేందుకు తాను హైదరాబాద్ నుండి వరంగల్ వైపు ప్రయాణిస్తుండగా, లారీ ఒకటి తన కారును వెనుకనుంచి యశ్వంతాపూర్ వద్ద ఢీకొట్టిందన్నారు. దాదాపు 100 నుంచి 200 మీటర్ల వరకు తన కారును లారీ ఈడ్చుకువెళ్లిందన్నారు.
తన కారును ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడని, అయితే స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఘటనను చూస్తుంటే తనపై హత్యాయత్నంగా కనిపిస్తోందని, విచారణ జరిపాలని ఆయన జనగామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దుర్గాప్రసాద్ తన ఫిర్యాదులో ప్రస్తావించిన లారీ మధ్యప్రదేశ్ (MP66 H2577) రిజిస్ట్రేషన్ తో ఉండడం గమనార్హం. కాగా లాయర్ దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ సీఐ మల్లేష్ చెప్పారు.
తన కారును లారీ ఢీకొట్టిన ఘటనపై అడ్వకేట్ దుర్గాప్రసాద్ ఏమంటున్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.