మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశంలో ఆకుల లలిత, సర్దార్ పుటం పురుషోత్తం పటేల్‌ పిలుపు

మహిళలు మేలుకొని ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌ పర్సన్ ఆకుల లలిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌లో జరిగిన మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్ల సమావేశం సొసైటీ వ్యవస్థాపకుడు, తెలంగాణ మున్నూరుకాపు అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సర్దార్‌ పుటం పురుషోత్తం పటేల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం విధి విధానాలు రూపొందించి కార్యాచరణ ప్రకటించారు. సొసైటీలో రాష్ట్ర చైర్మన్‌, వైస్ చైర్మన్ సహా మొత్తం 45 మంది డైరెక్టర్లు ఉంటారు.

ఈ సమావేశంలో ఆకుల లలిత, పుటం పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ, ఈ సొసైటీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను మహిళలకు అందేలా చూస్తూ, ఆర్ధికంగా నిలబెడతామని స్పష్టం చేశారు. మహిళలకు నచ్చిన పనుల్లోనే శిక్షణనిచ్చి, స్వశక్తితో పైకి ఎదిగేలా ఆర్ధికంగా నిలబెట్టి, ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు తమవంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సొసైటీ ద్వారా మహిళలు స్వయం ఉపాధిని సాధించి సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని గడపాలని వారు సూచించారు. సొసైటీ చైర్మన్ ఏటిగడ్డ అరుణ పటేల్ మాట్లాడుతూ, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. సమావేశంలో మున్నూరుకాపు మహిళ మ్యాక్ సొసైటీ రాష్ట్ర డైరెక్టర్లకు నియామక పత్రాలను, గుర్తింపుకార్డులను కూడా అందజేశారు.

Comments are closed.

Exit mobile version