మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా బాధితులకు నిత్యాన్నదానం చేయాలని తలంచారు. ప్రతిరోజు వెయ్యి మందికి లబ్ధి చేసే ఈ సాయం మున్ముందు వివిధ రూపాల్లో మరింత విస్తృతం కావాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కరోనా బాధితులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే…

‘‘కంటి మీద కునుకు లేదు. కాలే కడుపునకు మెతుకు లేదు. సేద తీరేందుకు చోటు లేదు. ఆసుపత్రి పడకపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడే తమ ఇంటి ప్రాణం లేచిరావాలని దేవుడికి మొక్కుతూ… కళ్లనిండా నీళ్లు నింపుకుని గాంధీ ఆసుపత్రి ముందు దిక్కుతోచక ఎదురు చూస్తోన్న కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యుల దీనస్థితి ఇది.

ఈ దృశ్యాలు గుండెకు గాయం చేస్తున్నాయి. మనసును మెలిపెడుతున్నాయి. ఓ నాయకుడిగానే కాదు, నాలోని మనిషిని కలచివేస్తున్నాయి. ఈ వేదనాభరితుల సాయం కోసం ఓ ప్రయత్నం ఇది. ‘’ఆకలి కడుపులకు అన్నం పెట్టే హస్తం’’ ఇది. గాంధీ వద్ద పడిగాపులు కాస్తోన్న బాధిత కుటుంబ సభ్యుల కోసం లాక్‌డౌన్ లో నిత్య అన్నదానం చేయాలని నిర్ణయించాను. వెయ్యి మందికి లబ్ధిచేసే ఈ సాయం మున్ముందు వివిధ రూపాలలో విస్తృతమవ్వాలన్నది ఆకాంక్ష.

అలాగే, వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకుని చిరునవ్వులతో ఇంటికి చేరాలని కోరుకుంటూ…
గాంధీ ఆసుపత్రి వద్ద కోవిడ్ బాధితుల కోసం సాయంగా వచ్చిన కుటుంబ సభ్యుల ఆకలితీర్చే అన్నదాన కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నాను.’’

ఎ రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి

Comments are closed.

Exit mobile version