బుడాన్ బేగ్ మృతిపై ఎంపీ నామ నాగేశ్వర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణ ఉద్యమ నేత , టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్ ఐడీసీ మాజీ ఛైర్మన్ బుడాన్ బేగ్ కరోనాతో పోరాడి తుది శ్వాస విడవడం పట్ల పార్టీ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు . బుడాన్ బేగ్ మృతి తనను కలచివేసిందని ఎంపీ నామ విచారం వ్యక్తం చేశారు . సంస్థాగతంగా క్రియాశీలకంగా పని చేసిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు . బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బేగ్ కోసం అవసరమైన, కీలకమైన మెడిసిన్ అందుబాటులో లేక ఆరోగ్యం ప్రమాదంలో పడిన సంగతిని తెలుసుకున్నానని, వెంటనే స్పందించి , చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను సేకరించినట్లు చెప్పారు. వాటిని రోడ్డుమార్గాన పంపిస్తే ఆలస్యమవుతుందని భావించి విమానంలో బేగ్ కుమారుడు అబ్దుల్ కలాం ద్వారా పంపించానని, ఆదివారం కూడా 42 ఇంజక్షన్లు పంపానని, మళ్ళీ సోమవారం మరో 21 ఇంజక్షన్లు బెంగుళూరు పంపించినట్లు చెప్పారు. బేగ్ కోలుకుని తిరిగి ఇంటికి వస్తాడనుకున్న సమయంలో మృత్యువాతపడడం తనను తీవ్రంగా కలచివేసిందని నామ ఆవేదన వ్యక్తం చేశారు. బేగ్ తనతో ప్రాణంలో ప్రాణంగా ఉండే వాడని, తన సొంత సోదరునిలాంటి వాడని పేర్కొన్నారు . తానంటే ఎంతో అభిమానంగా ఉండే బేగ్ ను కరోనా పొట్టన పెట్టుకోవడం అత్యంత బాధాకరమని ఎంపీ నామ పేర్కొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ఆత్మ స్థయిర్యాన్ని దైవం బేగ్ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని, అలాగే బేగ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, బేగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు .

Comments are closed.

Exit mobile version