అభివృద్ధిలో తెలంగాణకు ఖమ్మం ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం మరింత అభివృద్ధి జరగాలని, కేంద్రం తీసుకోవటమే తప్ప ఇచ్చింది లేదని, అయినా అభివృద్ధి ఆగలేదన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఖమ్మం, సత్తుపల్లి కేంద్రాల్లో వివిధ కారక్రమాలలో పాల్గొన్నారు. తొలుత రూ. 36 కోట్లతో నిర్మించనున్న 2వ దశ ఐటీ హబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ నుండి 48వ డివిజన్లలలో రూ.30 కోట్లు ఎస్డీఎఫ్ నిధులతో సిసి, బిటి రోడ్ల పునరుద్ధరణ, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా శ్రీశ్రీ సర్కిల్ నుండి వివి పాలెం వరకు రూ. 35 కోట్లతో నిర్మించనున్న నాలుగు లేన్ల బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో ఒకే సముదాయంలో 1000 పేదల డబుల్ ఇళ్లను ప్రారంభించి, అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని 45 వేల నూతన కనెక్షన్లు, 85వేల పాత కనెక్షన్స్ ద్వారా ప్రతి రోజు ఇంటికి మంచినీటి సరఫరను ప్రారంభించారు. రూ. 2కోట్లతో కాల్వొడ్డులో ఆధునికీకరించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 25 కోట్లతో నిర్మించించిన అధునాతన ఆర్టీసీ బస్ స్టాండ్ ను ప్రారంభించారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఖమ్మం తరహాలో అభివృద్ధిని చూడగలమని మంత్రి కేటీఆర్ అన్నారు. అనుకున్నదే తడవుగా శంకుస్థాపన చేసుకుని వాటిని పూర్తి చేసి ప్రారంభించుకోవడం పట్ల మంత్రి పువ్వాడను అభినందించారు.

Comments are closed.

Exit mobile version