‘‘దొంగలెవరో, దొరలెవరో ద్రోహులెవరో, మోసకారులెవరో, అసలు, సిసలు వాళ్లెవరో తెల్వాల్సి ఉంటది రాజకీయాలల్ల. ఒక్కటి మాత్రం సత్యం… దొంగలు, మోసకారులు ఒక్కసారి మోసం చేస్తరు కావచ్చు. ధర్మాన్ని మాత్రం ఎవ్వడూ మోసగించలేడు. న్యాయాన్ని కప్పిపుచ్చలేరు. ధర్మం, న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒక పత్రిక రాస్తది… ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే. కొడకా… కులంతో కొట్లాట చరిత్ర పెట్టలే. తెలంగాణా ఆత్మగౌరవం కోసం కొట్లాడినం. విముక్తి కోసం కొట్లాడినం తప్ప… చిన్న మనిషా? ఈటెల రాజేందర్ అనెటోడు? ఈటెల రాజేందర్ అనెటోడు తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల తెలంగాణా బిడ్డల ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన బిడ్డ ఈ బిడ్డ. మేం గులాబీ జెండాకు ఓనర్లం. మధ్యల వచ్చినోళ్లం కాదు. బత్కొచ్చినోళ్లం కాదు. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం శాశ్వతం కాదు. ధర్మం, న్యాయం శాశ్వతం. నాయకులు కాదు… ప్రజలే చరిత్ర నిర్మాతలు. ధీరుడు ప్రజల్లో కొట్లాడుతడు. కుట్రలు, డబ్బుతో కొట్లాడడు.’’
తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ 2019 ఆగస్టులో చేసిన ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా? హుజూరాబాద్ సభలో రాజేందర్ చేసిన అప్పటి వ్యాఖ్యల్లో ఇవి కొన్ని మాత్రమే. సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముందు అప్పట్లో ఈటెల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర కలకలానికి దారి తీశాయి. ‘రాజేంద్రన్న తన కడుపులో ఏదీ దాచుకోడు’ అంటూ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా శ్రుతి కలిపారు.
తాజాగా రెండు రోజుల క్రితం వీణవంక మండల పర్యటనలో ఈటెల రాజేందర్ తన వ్యాఖ్యల ద్వారా మళ్లీ రాజకీయ చర్చకు తెరలేపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మంత్రి ఈటెల తాజాగా ఏమన్నారో తెలుసా? ‘కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే… కొనుగోళ్లు జరగాల్సిందే’ అని ధాన్యం క్రయ కేంద్రాలను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదని, నష్టాలు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాలను కొనసాగించలేమని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రకటన చేసిన నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ఆయా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి రాజేందర్ మళ్లీ తన మాటలను సవరించుకునట్లు కనిపిస్తోంది.
సీఎం కేసీఆర్ కు, తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, తనకు ప్రజలకు మధ్య కూడా రెండు దశాబ్ధాల అనుబంధం ఉందన్నారు. సీఎం కేసీఆర్ మీద తనకు ఆజమాయిషీ ఉందని, ఏది కావాలో? మరేం వద్దో? రైతులు కోరుకుంటున్నదేమిటో కేసీఆర్ కు చెప్పే బాధ్యత తనపై ఉందంటున్నారు. గడచిన ఆరేళ్లుగా కేసీఆర్ వ్యవసాయం రంగం మీదే కష్టపడ్డారని, కేసీఆర్ మనసేమిటో తనకు తెలుసని, వ్యవసాయంలో తెలంగాణా రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతూ ఈటెల తన రెండు రోజుల క్రితంనాటి వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వీణవంక, జమ్మికుంట మండలాల్లో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో ఈటెల నోటి నుంచి జాలువారిన ఆయా ప్రసంగాల్లోని వ్యత్యాసాలపైన ఇప్పుడు రాజకీయ చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక, మంత్రివర్గ విస్తరణ సమయంలో, ప్రస్తుతం కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం జరగనుందనే వార్తల సందర్భాల్లో మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నట్లు ఈటెలను డిప్యూటీ సీఎం చేయాలని, సమైక్య రాష్ట్రంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో చెడుగుడు అడుకున్న రాజేందర్ ను సీఎం చేస్తే తప్పేమిటి? అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ గమనించాల్సిన అసలు విషయం.