మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ పి. శ్రీనివాసరెడ్డిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రైనీ మహిళా ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు.
తనపై ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అత్యాచార యత్నం చేసినట్లు ట్రైనీ మహిళా ఎస్ఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలిసి ట్రైనీ మహిళా ఎస్ఐ ఈమేరకు ఫిర్యాదు చేశారు. అయితే ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని, నిజమని తేలితే ఎస్ఐ శ్రీనివాసరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ కొద్ది గంటల క్రితమే ప్రకటించారు.
ఆయా పరిణామాల్లోనే ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని, ఆ తదుపరి చర్యలు ఉంటాయని మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటించారు. కాగా ఎస్ఐ శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ట్రైనీ మహిళా ఎస్ఐ చేసిన ఆరోపణల పర్వం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది.