మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా, బీజేపీలో చేరిక పరిణామాలపై నిషేధిత మావోయిస్టు పార్టీ ఘాటుగా స్పందించింది. ఈమేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా, తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని చెప్పిన ఈటెల రాజేందర్ ఆ వెనువెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని, కేసీఆర్, ఈటెల కలహం ప్రజలకు సంబంధించిన విషయం ఏ మాత్రం కాదన్నారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం కేసీఆర్ తోపాటు ఈటెల కూడా ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచారని, మొన్నటి వరకు కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటెల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడరన్నారు. అందులో భాగంగానే పేదల అసైన్డ్ భూములను ఆక్రమించారని, తెలంగాణాలో ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తానని చెప్పిన రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరాడని జగన్ ఆరోపించారు.

అటు బీజేపీ హిందూత్వ ఫాసిజానికి, ఇటు కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రజలు పోరాడుతున్న సమయంలో ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి మళ్లీ హుజూరాబాద్ నుండి అసెంబ్లీ స్థానాన్ని గెల్చుకోవడం కోసం తెలంగాణా ఆత్మగౌరవం కోసం పోరాడుతానని చెబుతున్నారని, టీఆర్ఎస్ లో ప్రధాన భూమిక పోషించిన ఈటెల ప్రజల ఆత్మగౌరవాన్ని ఏనాడో తుంగలో తొక్కారని జగన్ విమర్శించారు.

అంతేగాక ప్రజల్లో తమ పార్టీకి గల పేరు, ప్రతిష్టలను సొమ్ము చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ యూ శక్తులు కలిసి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయని, ఆయా రెండు శక్తులను ఒకేగాటన కడుతున్నారని ఆక్షేపించారు. ఆర్ఎస్ యు, మావోయిస్టులు కూడా తనకు మద్ధతునిస్తారని ఈటెల చెప్పుకోవడం పచ్చిమోసంగా జగన్ అభివర్ణించారు. ఈటెల తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని, ఈటెల అవకాశవాదాన్ని, కేసీఆర్ నిరంకుశత్వాన్ని తెలంగాణా ప్రజలు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. నిజమైన తెలంగాణా ప్రజా ఆత్మగౌరవ పోరాటానికి ప్రజలు మరోసారి సిద్ధం కావాలన్నారు.

Comments are closed.

Exit mobile version