‘సుక్మానుంచి అందిన సమాచారం ప్రకారం నక్సల్ నేత రామన్న గుండెపోటుతో మరణించారు. కానీ పోలీసులు విషయాన్ని ధృవీకరించలేదు.’
ఆదివారం…దాదాపు అర్థరాత్రి. సమయం సుమారు 11 గంటలు. ఛత్తీస్ గఢ్ ప్రాంతంలోని ఓ జర్నలిస్టు మిత్రుని నుంచి ఫోన్. ’సార్, మావోయిస్టు పార్టీ అగ్రనేత రామన్న గుండెపోటుతో మరణించారట. మీ సోర్స్ ను ఉపయోగించి సమచారం కనుక్కోండి’ ఇదీ ఫోన్ కాల్ సారాంశం. అప్పటికే నేను కునుకులోకి వెడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలింది. ఓ జర్నలిస్టుగా ఇటువంటి సమయంలోనే అత్యంత వేగంగా స్పందించే అలవాటు ఎప్పడో 31 ఏళ్ల క్రితమే అబ్బింది. ఫోన్ కాల్ నుంచి తేరుకున్నాక వెంటనే ఓ పోలీసు అధికారిని నిద్ర లేపాను. తెలంగాణా-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఆ పోలీసు అధికారికి ఇటువంటి వ్యవహారాల్లో మంచి సమాచారం ఉంటుంది లెండి. భద్రాచలం-ఛత్తీస్ గఢ్ అటవీ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో ఆ పోలీసు అధికారి మంచి పేరు కూడా సంపాదించారు. నేను అడిగిన సమాచారంపై ఆయా పోలీసు అధికారి కూడా నిర్ధారించలేని పరిస్థితి. ఉదయం అసలు విషయం చెబుతానని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ లోని మీడియా రామన్న మృతి చెందినట్లు వార్తలు ప్రసారం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు అర్థరాత్రి వేళ బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చాయి. గుండెపోటుతో రామన్న మృతి చెందాడని, కానీ పోలీసులు విషయాన్ని ధృవీకరించలేదని మరికొన్ని వెబ్ సైట్లు వార్తా కథనాలను క్లుప్తంగా అందించాయి.
ఎవరీ రామన్న?
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి రామన్న ప్రస్తుతం అత్యంత కీలక నేత. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి చెందిన రామన్న ప్రస్తుతం దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ (డీకేజెడ్ఎస్ సీ) కార్యదర్శి. గతంలో సౌత్ బస్తర్ డివిజన్ కార్యదర్శిగా వ్యవహరించారు. సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ పరిధిలోకి జగదల్పూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలు మాత్రమే వస్తాయి. దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ పరిధిలోకి ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, జగదల్పూర్, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, కాంఖేడ్, రాజ్ నంద్ గావ్ తదితర జిల్లాలతోపాటు మల్కనగిరి, మహారాష్ట్రలోని గడ్చిరోలి, తెలంగాణాలోని భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి వంటి అటవీ జిల్లాలు కూడా వస్తాయి. అటు ఛత్తీస్ గఢ్, ఇటు ఒడిషా, ఓవైపు మహారాష్ట్ర, మరోవైపు తెలంగాణా జిల్లాల్లోని అటవీ ప్రాంతాలతో కూడిన ప్రాంతాలను మావోయిస్టు పార్టీ డీకేజెడ్ఎస్ సీ గా వ్యవహరిస్తోంది. ఇదిగో ఇంత విశాలమైన అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు పార్టీ నక్సల్ దళాలకు రామన్న నాయకత్వం వహిస్తున్నారు. అటువంటి అగ్రనేత రామన్న మృతి అంటూ ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేయడం సహజంగానే సంచలనం కలిగించింది. కానీ సోమవారం ఉదయంకల్లా ఇది ఫేక్ వార్తగా తేలింది.
అయితే ‘గుండెపోటుతో రామన్న మృతి’ అంటూ పుకారు వార్తలు షికారు చేయడం వెనుక అసలు కారణం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. బీజాపూర్ జిల్లా సర్కేగూడ ఎన్కౌంటర్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే కదా? సర్కేగూడలో 2012 జూలై 28న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది మావోయిస్టు నక్సలైట్లు కాదని, మృతి చెందిన 17 మంది అమాయక ఆదివాసీలేనని జస్టిస్ వీకే అగర్వాల్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ నివేదిక లీక్ కావడంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతోంది. అన్యాయంగా చనిపోయిన ఆదివాసీల గురించి కాదు, జస్టిస్ అగర్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఎలా లీకైందనే పాయింట్ మీదే ఆయా రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సర్కేగూడ ఎన్కౌంటర్లో ఆదివాసీలను పొట్టన పెట్టుకున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ డీకేజెడ్ఎస్ సీ కార్యదర్శి రామన్నగిరిజనులను సమీకరించి ఉద్యమం నిర్వహించే పని ప్రారంభించారట. ఆ ప్రక్రియ ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ అడవుల్లో జోరుగా సాగుతోందట. ఇదిగో ఈ నేపథ్యంలోనే సర్కేగూడ ఎన్కౌంటర్లో 17మంది ఆదివాసీల హత్యాకాండ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు రామన్నగుండెపోటుతో మరణించారనే ప్రచారాన్ని కొందరు వ్యాప్తిలోకి తీసుకువచ్చారట. అయితే ఈ పుకారును షికారు చేయించింది రాజకీయ పార్టీలకు చెందినవారేనా? లేక రూపం మార్చుకున్న నక్సల్ వ్యతిరేక సంస్థలా? అనే విషయం మాత్రం రూఢీ కాలేదు. రామన్నమృతి ప్రచారం వెనుక అసలు సంగతి అదన్నమాట?