యూకేలో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ తో అప్పుడే మనదేశంలోనూ అప్రమత్తత ప్రారంభమైంది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి సహా అన్ని ప్రధాన నగరాల్లో రేపటి నుంచి కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 22వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక యూరప్, మధ్యతూర్పు దేశాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణీకులు పధ్నాలుగు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. యూకేలో బయటపడ్డ ఈ కొత్తరకం వైరస్ తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్న పరిస్థితుల్లోనే మహారాష్ట్ర సర్కార్ ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించడం గమనార్హం. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే పలు దేశాలు యూకే నుంచి వచ్చే విమాన సర్వీసులను నిలిపివేశాయి.