తన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈసారి తప్పిదాన్ని పత్రికల వైపునకు నెట్టేశారు. మహబూబాబాద్ తొలి కలెక్టర్ ప్రీతి మీనా అంశంలో 2017 జూలైలో నెలకొన్న వివాదానికి సంబంధించి శంకర్ నాయక్ ప్రవర్తనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రీతిమీనాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ అప్పట్లో బేషరతుగా క్షమాపణ చెప్పారు. కలెక్టర్ ప్రీతిమీనా తన సోదరితో సమానమని, ప్రీతిమీనాకు అనుకోకుండా తన చేయి తగిలి ఉండవచ్చని శంకర్ నాయక్ వివరణ ఇచ్చారు. హరితహారం సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతిమీనాతో దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, బేషరతుగా కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించిన నేపథ్యంలో శంకర్ నాయక్ అప్పట్లో దిగిరాక తప్పలేదు.
కానీ తాజా వివాదంలో మాత్రం తన తప్పు ఏమీ లేదని, పత్రికలే తప్పుగా అర్థం చేసుకున్నాయని శంకర్ నాయక్ వాదిస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వెలమ, రెడ్డి కులాలకేగాక డబ్బున్నవాళ్లకు. బాగా చదువుకున్న వాళ్లకు బలుపు ఉంటుందని చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది. ప్రసార మాధ్యమాల్లో ఈ అంశానికి సంబంధించి భారీ ఎత్తున వార్తా కథనాలు కూడా వచ్చాయి. దీంతో శంకర్ నాయక్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును ఆయన పీఆర్వో విడుదల చేశారు. తాజా వివాదంలో శంకర్ నాయక్ ఈ ప్రకటనలో ఏమంటున్నారో…ఆయన మాటల్లోనే దిగువన చదవండి.
‘‘నేను సీఎం కేసీఆర్
గారి దయవల్ల మహబూబాబాద్ నియోజకవర్గంలో రెండోసారి శాసన సభ్యునిగా ఎన్నుకోబడిన నాటి
నుండి అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడటం జరుగుతుంది. దానిలో భాగంగా
నిన్న కేసముద్రం మండలంలో జరిగిన క్రిస్టియన్ బట్టల పంపిణీ కార్యక్రమంలో నేను
అబ్రహం లింకన్ గురించి ప్రసంగిస్తున్న సందర్బంలో అక్కడ విషయాన్ని కొన్ని పత్రికలు
వేరే విధంగా అర్థం చేసుకోవడం జరిగింది కానీ నేను ఉద్దేశపూర్వకంగా ఏ సామాజిక వర్గాల
మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడలేదు. కావున దానిని ఎవరూ తప్పుగా భావించి నన్ను
అపార్థం చేసుకోవద్దని నా యొక్క మనవి…’’
మీ..
బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్యే
మహబూబాబాద్.