ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆరు రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భాగెల్ ఆదివారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అప్పగించిన ఎన్నికల బాధ్యతలను నిర్వహించిన సీఎం భూపేష్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఆయన రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకునే చర్యలను ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అది లాక్ డౌన్ కు కూడా దారి తీయవచ్చని అక్కడి అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా గత 24 గంటల్లో ఛత్తీస్ గఢ్ లో 1,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఉండడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది,.

Comments are closed.

Exit mobile version