హైకోర్టు అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల దారుణ హత్యోదంతం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందా? అధికార పార్టీ విజయావకాశాలను గట్టి దెబ్బ తీస్తుందా? సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటన న్యాయవాద వర్గాల ఓట్లకు భారీగా గండికొడుతుందా? ఇదే జరిగితే దాని ఫలితం ఎలా ఉండబోతోంది? ఇవీ గులాబీ పార్టీ శ్రేణుల సందేహాలు. తెలంగాణాలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేయాలా? వద్దా? అనే అంశాన్ని అధికార పార్టీ నేటి వరకు తేల్చుకోలేదు. ఇందుకు గత అనుభవాలు, కొన్ని చేదు ఫలితాలే కారణంగా భావిస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డినే మరోసారి ఖరారు చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ పల్లాకు బీ ఫారాన్ని కూడా ఇచ్చారు. రాజేశ్వర్ రెడ్డి గెలుపును అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు భుజాన వేసుకుని భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.

పల్లా గెలుపును అధికార పార్టీ కూడా సవాల్ గానే తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం 11 కొత్త జిల్లాలతో కూడిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానంలో పల్లాను మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించడం అధికార పార్టీ నేతలకు ఓ సవాల్ గా మారిందంటున్నారు. పార్టీపరంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న ఈ స్థానం నుంచి ‘పల్లా’ గెలుపు నల్లేరుపై నడకేమీ కాకపోవచ్చని అంటున్నారు. కానీ పల్లా విజయం సాధించకుంటే మాత్రం ఆ తర్వాత రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు అనివార్యమనే వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘పల్లా’ మళ్లీ గెలిస్తే ఈసారి ఆయనకు మంత్రి పదవి ఖాయమని, దాంతో మూడు ఉమ్మడి జిల్లాల్లో రెండో పవర్ సెంటర్ ఏర్పడుతుందని ఆందోళన కూడా కొందరు గులాబీ నాయకుల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా పల్లా గెలుపును కొందరు నేతలు పైపైన మాత్రమే కోరుకుంటున్నారని, అంతర్గతంగా చేస్తున్న కృషి ఇందుకు విరుద్దంగా ఉందనేది ప్రచారపు సారాంశం. ప్రతి యాభై మంది ఓటర్లకు ఓ ఇంచార్జి చొప్పున పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని పార్టీ నాయకత్వం పరిగణిస్తున్న తీరును అవగతం చేసుకోవచ్చంటున్నారు. ఏమాత్రం ఫలితం తలకిందులైనా దాని ప్రభావం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనేగాక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపైనా తీవ్రంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

మంథనిలో తెలంగాణా న్యాయవాదుల జేఏసీ ర్యాలీ దృశ్యం

అయితే ఈనెల 17వ తేదీన పెద్దపల్లి జిల్లాలో జరిగిన వామన్ రావు, నాగమణి అడ్వకేట్ దంపతుల హత్యోదంతం గులాబీ పార్టీ నేతల్లో తీవ్ర గుబులు కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయవాదుల దారుణ హత్యపై రాష్ట్ర స్థాయిలో లాయర్లు ఆందోళనకు దిగడం, నిరసనలు, విధుల బహిష్కరణ, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు తదితర అంశాలు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు సమాచారం. అడ్వకేట్ దంపతులు హత్యోదంతంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన లాయర్లు కూడా నిరసన ప్రదర్శనలు, ర్యాలీల్లో పాల్గొనడం గమనార్హం. ఇక్కడ పార్టీకన్నా సహచర న్యాయవాదుల దారుణ హత్యను ప్రామాణికంగా తీసుకుని ఆందోళనకు దిగడం గులాబీ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులే ఓటర్లుగా ఉండడం, వీరిలో లాయర్ల సంఖ్య గణనీయంగా ఉండడం గమనార్హం. అంతేగాక ఒక్కో లాయర్ సగటున నాలుగు ఓట్లను ప్రభావితం చేసే అవకాశముందని పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలో అడ్వకేట్ దంపతుల హత్యోదంతం అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుపై ప్రభావాన్ని చూపుతుందా? అదే జరిగితే పరిణామాలు మరే అభ్యర్థికి అనుకూలంగా మారవచ్చు? దాని ఫలితపు పర్యావసనాలు రాజకీయంగా ఏ మలుపునకు దారి తీస్తాయి? ఇదీ రాజకీయంగా జరుగుతున్న తాజా చర్చ.

Comments are closed.

Exit mobile version