తెలంగాణాలో సరికొత్త రాజకీయ పునరేకీకరణ జరగబోతున్నదా? ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించే ముఖ్య రాజకీయ నేతలు కొందరు ఒకే గొడుగు కిందకు చేరబోతున్నారా? తెలంగాణాలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిందా? దాన్ని పూడ్చేందుకు కొందరు ముఖ్యనేతలు ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీకి ‘జై’ కొట్టే అవకాశముందా? గత కొన్ని రోజులుగా తెలంగాణా వ్యాప్తంగా పలు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇందుకు సంబంధించి ఒకరిద్దరు ముఖ్య నేతలు ఇప్పటికే టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ధ్రువపడిన సమాచారం మాత్రం అందుకు విరుద్దంగా ఉండడం గమనార్హం. అయితే ఈ పునరేకీకరణ జరిగే అవకాశాలను మాత్రం చర్చల్లో గల నాయకుల అనుచరణగం తోసిపుచ్చడం లేదు.

అసలు విషయంలోకి వెడితే… టీపీసీసీ చీఫ్ పదవిలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం అవుతారనే అంశం ఇప్పటికీ తేలడంలేదు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పేరు టీపీసీసీ అధ్యక్షునిగా ఖరారైనట్లు కొద్దినెలల క్రితం వార్తలు వచ్చాయి. కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వరకు అధ్యక్షున్ని ప్రకటించవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలే అధిష్టానానికి లేఖలు రాశారని, అందువల్ల అతని నియామకం వాయిదా పడిందనే ప్రచారమూ జరిగింది. ఇదే దశలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మూడు నెలల తర్వాత తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ గురించి ప్రకటిస్తానని కొండా వెల్లడించారు. ఈ పరిణామాల్లోనే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఓటమి పాలయ్యారు. ఒంటరి పోరాటం చేసినప్పటికీ, నిధుల లేమి వెంటాడినా, ఆయనకు భారీగానే గ్రాడ్యుయేట్ల ఓట్లు పడడం గమనార్హం. క్లుప్తంగా చెప్పుకోవాలంటే తాజా పరిణామాల్లోనే రాజకీయ పునరేకీకరణ అనే అంశంపై చర్చ జరుగుతోంది.

తెలంగాణాలో ఏర్పడిందని భావిస్తున్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు కొందరి కలయిక అవసరమని, అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎంపీ రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ తో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణాలో కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఈ మంతనాలు జరిగాయంటున్నారు. తెలంగాణాలో బలమైన సామాజిక వర్గాలను ఏకం చేయడమే లక్ష్యంగా కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరామ్ కు గౌరవం ఇస్తూనే, ఆయన స్థానాన్ని పదిలపరుస్తూనే రాజకీయంగా ముందడుగు వేసేందుకు రేవంత్ రెడ్డి చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మరికొందరు నాయకులు పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటారని, ఆర్థిక బలం లేని కోదండరామ్ ఎంతగా పోరాటం చేసినా ప్రయోజనం లభించడం లేదనే భావనను ఆయా నేతలకు చెందిన అనుయాయులు వ్యక్తం చేస్తున్నారు.

టీజేఎస్ పార్టీకి ఉద్యమకారుల అండ ఉండడమేగాక, తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల్లో కేడర్ ఉంది. ఇతర పార్టీల్లో ఇమడలేపోతున్నవారిని టీజేఎస్ నీడలో ఏకంగా చేసే దిశగా వ్యూహరచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి అనేక కారణాలను బేరీజు వేసుకుని వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టీజేఎస్ ను బలమైన శక్తిగా రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నాయకులు టీజేఎస్ నీడకు చేరితే తెలంగాణాలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు అనివార్యమనే వాదన వినిపిస్తోంది. కోదండరామ్ వ్యక్తిత్వం, రేవంత్ మాస్ ఫాలోయింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి బలమైన నేత అండదండలు ఏకమైతే రాజకీయ శూన్యతను భర్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నారట. అయితే తమ నాయకున్ని రేవంత్ రెడ్డి కలిశారని, మంతనాలు జరిపారనే వార్తలు సత్యదూరమని ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. కానీ ఈ దిశగా రాజకీయ పునరేకీకరణ జరిగితే ఎలా ఉంటుందనే అంశంపై భిన్న వర్గాల్లో చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని టీజేఎస్ వర్గాలు కూడా అంగీరిస్తుండడం విశేషం.

Comments are closed.

Exit mobile version