ఖమ్మం డీసీసీబీ నిధుల వివాదంపై ఆ బ్యాంకు మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తాను వ్యవహరించానని, రైతుల కోసం తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డీసీసీబీ చైర్మన్ గా తాను వ్యవహరించిన కాలంలో సమష్టిగానే నిర్ణయాలు తీసుకున్నామని, ఏకపక్షంగా, వ్యక్తిగతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. బోర్డులో టేబుల్ ఎజెండాలు పెట్టలేదని, ఎజెండా ద్వారా మాత్రమే కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పాలకవర్గం, అధికారులు కలిసే నిర్ణయాలు తీసుకున్నారని, అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు.
దౌర్భాగ్యమైనటువంటి, నికృష్టమైనటువంటి పనులు రైతులకు నష్టం చేకూరుస్తాయన్నారు. అధికారాన్నితాను దుర్వినియోగం చేయలేదని, అహంకారంతో వ్యవహరించలేదన్నారు. పదవులను అహంకారంగా భావించిన ఎంతో మంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని, దాన్ని గమనించాల్సిన అవసరముందన్నారు. ముఖ్యమంత్రుల కుమారులు, మంత్రులు కూడా ఈరోజు ఇళ్లల్లో పడుకునే పరిస్థితి ఉందన్నారు. ఇది రెండు లక్షల మంది రైతుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని, ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా తనపై తీర్చుకోవాలే తప్ప, రైతాంగానికి నష్టం జరిగే పనులు చేయవద్దని విజయ్ బాబు కోరారు.
ఇటువంటి చర్యలను తప్పకుంటా అడ్డుకుంటామని, దీనికోసం అవసరమైతే జైలుకైనా వెడతానని వ్యాఖ్యానించారు. దేనికైనా చట్టం, న్యాయ వ్యవస్థలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో ఒక్క రూపాయి అవినీతి జరిగినా తాను బాధ్యత వహిస్తానని, అవసరమైతే తన ఆస్తులు అమ్మి అయినా సరే చెల్లిస్తానని ప్రకటించారు. విషయాన్ని వక్రీకరించవద్దని, కొన్ని సామాజిక వర్గాలు, మీడియా కూడా ఎంత అసభ్యంగా… చూస్తుంటే బాధనిపిస్తోంది… అని విజయ్ బాబు అన్నారు. జర్నలిజం సిగ్గుపడే విధంగా రాతలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాతలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరారు.