తాటిపర్తి జీవన్ రెడ్డి… తెలంగాణా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. కరడుగట్టిన కాంగ్రెస్ నేతగా ప్రాచుర్యం పొందిన జీవన్ రెడ్డికి పుట్టిన రోజు కానుకగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవిని బహుమానంగా ఇవ్వనుందా? అనే ప్రశ్నకు ఔననే సమాచారం వస్తోంది. తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసిందనే వార్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ, యాధృచ్ఛికంగా ఆయన బర్త్ డే కూడా కలసి రావడం విశేషంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.

టీ-పీసీసీ అధ్యక్షుని ఎంపికపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరుల పేర్లను ఉటంకిస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జీవన్ రెడ్డి పేరు ఖరారు కావడం గమనార్హం. ఈరోజు 11 గంటల సమయంలో ఈ అంశంలో సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డి ఎంపికకు సంబంధించి నియామక పత్రంపై సోనియాగాంధీ ఇప్పటికే సంతకం కూడా చేశారనేది తాజా సమాచారం. ఈ విషయంలో వారం రోజుల క్రితమే జీవన్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అర్జంటుగా ఢిల్లీకి రావలసిందిగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈమేరకు జీవన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని ఆయన అనుయాయులు చెబుతున్నారు.

పార్టీ సారథ్య బాధ్యతల అంశం ప్రస్తావన వచ్చినపుడు, తాను పార్టీకి విధేయుడినని, అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక బలం అనే అంశంపైనా పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. జీవన్ రెడ్డి మంచి ప్రజానాయకుడిగా పేరుగాంచినప్పటికీ, పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరుల అంశం ప్రస్తావనం కూడా వచ్చిందంటున్నారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నాయకులు అండగా ఉంటారని పార్టీ ముఖ్యులు భావించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జీవన్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపిక పూర్తయిందని, ప్రకటన లాంఛనమేనంటున్నారు మంగళవారం వస్తుందని భావిస్తున్న అధికారిక ప్రకటన జీవన్ రెడ్డికి బర్త్ డే కానుకగా కాంగ్రెస్ శ్రేణలు భావిస్తున్నాయి. ఎందుకంటే జనవరి 5న జీవన్ రెడ్డి పుట్టినరోజు కావడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version