వ‌రంగ‌ల్‌లో నూత‌న క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం దాదాపుగా పూర్త‌యింది. ఈనెల 21వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి ముస్తాబ‌వుతోంది. సుమారు రూ. 55 కోట్ల వ్య‌యంతో కేసీఆర్ స‌ర్కారు ఈ Integrated District Offices Complex (స‌మీకృత జిల్లా కార్యాల‌యాల స‌ముదాయం)ను నిర్మించింది. ప్ర‌ధాన ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌న్నీ ఒకే చోట ప్ర‌జ‌ల‌కు అందుబాటులోఉండాల‌నేది ఈ కాంప్లెక్స్ కాన్సెప్టు. ‘కలెక్టర్ గారి కార్యాలయం’ అనే పదం ఇక కానరాదు.

కొత్త భ‌వ‌నం నిర్మించ‌క ముందు ఇక్క‌డ దాదాపు 135 ఏళ్ల నాటి నిజాం కాలపు క‌ట్ట‌డం ఉండేది. 1886లో Mrs. George Palmer శంకుస్థాప‌న చేశారు. అక్క‌డున్న శిలాఫ‌ల‌కమే ఇందుకు ఆధారం. అయితే ఈ Mrs. George Palmer ఎవ‌ర‌నే దానిపై కొంత అస్ప‌ష్ట‌త నెల‌కొంది. నిజాం కాలం నాటి ప్ర‌ఖ్యాత‌ సివిల్ కాంట్రాక్ట‌ర్ స‌తీమ‌ణి అని కొంద‌రు, సికింద్రాబాద్‌లోని బ్రిటీష్ ప్ర‌తినిధి అని మ‌రికొంద‌రు చెబుతుంటారు. నిజాం పాల‌న వ్య‌వ‌స్థ‌లోకీల‌క‌మైన సుబేదార్‌లు ఈ భ‌వ‌నం నుంచే పాల‌న సాగించారు. ఆ త‌ర్వాత క‌లెక్ట‌ర్ల అధికారిక పాల‌న కేంద్రంగా మారింది.

హైద‌రాబాద్ స్టేట్ 1948లో ఇండియ‌న్ యూనియ‌న్‌లో విలీన‌మైన త‌ర్వాత, ఈ భ‌వ‌నం పాల‌న కేంద్రంగా అలాగే కొన‌సాగింది. దాదాపు ఏడు ద‌శాబ్దాల పాటు క‌లెక్ట‌ర్ల‌ అధికారిక కార్యాల‌యంగా, జిల్లా పాల‌న కేంద్రంగా విల‌సిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల్లో కొత్త క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాలు నిర్మించాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క్ర‌మంలో 2018లో ఈ భ‌వ‌నం కూల్చివేతకు ముహూర్తం నిర్ణ‌యించారు. అయితే భ‌వ‌నం పురాత‌న‌మైన‌ది అయినందున Historical/Heritage Monument గా గుర్తించి ప‌రిర‌క్షించాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ అప్పుడు మంత్రిగా ఉన్న క‌డియం శ్రీ‌హ‌రి, క‌లెక్ట‌ర్ గా ఉన్న ఆమ్ర‌పాలి వాటిని ప‌ట్టించుకోకుండా ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

వరంగల్ కలెక్టరేట్ పూర్వపు చిత్రం

చూస్తుండ‌గానే పాత భ‌వనం కాల‌గర్భంలో క‌లిసిపోయింది. G+2 విధానంలో విశాల‌మైన స్థ‌లంలో నిర్మించిన నూత‌న భ‌వ‌నం ఆధునికంగా క‌నిపిస్తోంది కానీ, ఆక‌ర్ష‌ణీయంగా, అబ్బురప‌డేలా మాత్రం లేదు. కొత్త సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణంలో కనిపించే కాక‌తీయ‌, అరబ్ నిర్మాణ‌రీతులు ఇక్క‌డ మ‌చ్చుకైనా క‌నిపించ‌వు. కాక‌తీయుల చ‌రిత్ర‌ను అడుగ‌డుగునా ఇముడ్చుకున్న వ‌రంగ‌ల్‌కు ఈ నూత‌న భ‌వ‌నం.. కొత్త‌ హంగు, అధికార ప‌టాటోప ప్ర‌తీక‌ అవుతుందేమో కానీ, కొత్త చ‌రిత్ర మాత్రం కాలేదు. కార్పొరేట్ లుక్‌లో మాత్ర‌మే కొలువుదీరిన‌ ఈ భ‌వ‌నం ఏ పాల‌న‌కు కార్పెట్ వేస్తుందో కాల‌మే చెప్పాలి.

✍️ శంకర్ రావు శెంకేసి

Comments are closed.

Exit mobile version