హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోకండి. ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు నివేదిక ప్రకారం అక్షారాల ఇది నిజం. చాయ్, సమోసా, ఛాట్ బండి ద్వారా చిరుతిండ్ల అమ్మకాలు సాగించే చిరు వ్యాపారుల ఆస్తులు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులే నివ్వెరపోయారు. బడుగు జీవులుగా రోడ్ల పక్కన చాయ్, సమోసా, ఛాట్ బండి నిర్వహించే ఈ చిరు వ్యాపారుల్లో అనేక మంది ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉండగా, మరికొందరికి వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని చిరు వ్యాపారులపై ఐటీ అధికారులు జరిపిన దర్యాప్తులో దిమ్మతిరిగే ఆయా వాస్తవాలు వెలుగు చూశాయి.

కాన్పూర్ కు చెందిన 256 మంది చిరు వ్యాపారులు కోటీశ్వరులుగా ఐటీ శాఖ దర్యాప్తులో బహిర్గతమైంది. ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించకపోగా, కనీసం జీఎస్టీ పరిధిలో కూడా ఈ చిరువ్యాపారులు లేరని తేలింది. లాల్ బంగ్లా ప్రాంతానికి చెందిన ఓ తుక్కు వ్యాపారి, బెకోన్ గంజ్ కు చెందిన మరో ఇద్దరు గడచిన రెండేళ్లలో రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ తేల్చింది. అంతేకాదు ఆయా 256 మంది చిరు వ్యాపారులు గడచిన నాలుగేళ్లలో రూ. 375.00 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది.

ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన ఓ పాన్ షాపు ఓనర్ రూ. 5.00 కోట్ల విలువైన ఆస్తులు కొన్నారని, మాల్ రోడ్డు ఏరియాకు చెందిన ఓ చిరుతిండ్ల వ్యాపారి కేవలం తన బండ్ల నిర్వహణ ప్రాంతాల్లో నెలకు రూ. 1.25 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడికాగా నివ్వెరపోవడం ఐటీ శాఖ అధికారుల వంతైందట. ఉత్తర ప్రదేశ్ లో గతంలోనూ ఈ తరహా ‘కోటీశ్వరులు’ ఉన్నట్లు అనేక వార్తలు రాగా, తాజాగా వెలుగు చూసిన సరికొత్త కోటీశ్వరుల కథనం జాతీయ స్థాయి వార్తాంశంగా చర్చల్లోకి రావడం విశేషం.

Comments are closed.

Exit mobile version